Mahanaadu-Logo-PNG-Large

సీబీసీఐడీకి శ్రీహరి రావు హత్య కేసు

– ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ 

అవనిగడ్డ, మహానాడు: నాలుగేళ్ల క్రితం అవనిగడ్డ నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఎంతో సంచలనాత్మకంగా మారిన ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోయారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్ళగా, వెంటనే స్పందించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లగా,  సీబీసీఐడీ విచారణ వేగవంతంగా జరిపిస్తామని చెప్పారని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసిన ఈ హత్యను సీబీసీఐడీ ఛేదిస్తుందని  ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల ఎన్నికల ప్రచారానికి అవనిగడ్డ వచ్చిన పవన్ కళ్యాణ్ దృష్టికి అవనిగడ్డ ప్రజలు ప్లకార్డు ద్వారా డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసును తీసుకువెళ్లి విచారణ కోరినట్లు తెలిపారు. డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసును పోలీసులు ఎందుకు ఛేదించలేకపోయారనే అనుమానాలు ఉన్నాయన్నారు. నేర రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దృష్టికి విషయాన్ని ఈ హత్య విషయం తీసుకు వెళ్లిన వెంటనే స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.