ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు చర్యలు చేపట్టాలి

ఎవరికి ఇవ్వాలో సందేహాలు నివృత్తి చేయండి
ఓపీవోలకు శిక్షణ ఇప్పించాలి
కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ

అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తప్పనిసరిగా వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదివారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లపై పీవో, ఏపీవోలకు శిక్షణ ఇచ్చిన విధంగానే ఓపీవో (అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌)లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. పోలీసులు, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనింగ్‌ పర్సనల్స్‌ వంటి ఓపీవోలకు శిక్షణ ఇవ్వకపోతే వారు పోస్టల్‌ బ్యాలెట్‌ను సరిగా వినియోగించుకోలేరని తెలిపారు.

2019 సాధా రణ ఎన్నికల లెక్కల ప్రకారం దాదాపు 56,545 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు ఎలా నింపాలో తెలియకే ఇంత పెద్ద మొత్తంలో ఈ విధంగా జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు పోస్ట ల్‌ బ్యాలెట్‌ ఓట్లపై సమగ్ర శిక్షణ ఇచ్చి వినియోగించుకునేలా చూడాలని కోరారు. నియోజక వర్గానికి దాదాపు 50 బస్సులు, 50 జీపులు ఎన్నికల విధుల్లో ఉంటాయని, రాష్ట్రం మొత్తం దాదాపు 18,000 వాహనాలు ఉంటాయన్నారు. ఎన్నికల విధులు నిర్వహించబోతున్న డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు, ఐటీ ఉద్యోగులను ముందుగా గుర్తించి వారికి ఫామ్‌-12 తప్పనిసరిగా అందే లా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఓపీవోలు ఫామ్‌-12ను ఎవరికి సమర్పించాలనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని, వారు ఓటరుగా ఉన్న ప్రాంతంలోని ఆర్‌వోకు సమర్పించాలా? లేక ఓపీవో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్‌వోకు ఇవ్వాలా? అన్న గందరగోళం లో ఉన్నారని తెలిపారు. ఫామ్‌-12 సమర్పించే ప్రతి ఓపీవోకు తప్పనిసరిగా ధృవీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్ల తాకిడి ఎక్కువగా ఉండే పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లలో అదనపు గెజిటెడ్‌ ఆఫీసర్లను నియమించాలని విజ్ఞప్తిచేశారు. పై అన్ని సందేహాలను నివృత్తి చేసి ప్రతి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటరు తమ ఓటుహక్కు తప్పనిసరిగా తప్పులు దొర్లకుండా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.