– రైల్వే జీఎంకు ఎంపీ కృష్ణదేవరాయలు లేఖ
పెదకూరపాడు , మహానాడు: పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలును అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న పెదకూరపాడు రైల్వే స్టేషన్లో ఆపాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను కోరారు. సికింద్రాబాద్ లో జీఎం ను కలిసి పల్నాడు జిల్లాలో రైల్వేకు సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. పెదకూరపాడు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గతంలో ఈ విషయమై పెదకూరపాడు జర్నలిస్టుల అభ్యర్థనను ఎ.పి.యు.డబ్లు.జె. జర్నలిస్ట్ సంఘం నాయకులు నిమ్మరాజు చలపతిరావు ఇటీవల ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల దృష్టికి తీసుకువెళ్లారు. తప్పక కృషి చేస్తానని ఇచ్చిన హామీని ఎంపీ ఆచరణలో పెట్టారని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం కార్యదర్శి కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ అన్నారు. పెదకూరపాడు ప్రాంత ప్రజల తరపున ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు, పాత్రికేయ మిత్రుడు చలపతిరావుకు ధన్యవాదాలు తెలిపారు.