తుపాను… ప్రభుత్వం అప్రమత్తం!

– హోం మంత్రి అనిత వెల్లడి

విశాఖపట్నం, మహానాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడామని, ఎలాంటి ప్రమాదం జరగకముందే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. తుపాను వల్ల ఏ ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయో ముందుగా గుర్తించాం.. అక్కడికి బృందాలను పంపిస్తున్నాం. తుపాను షెల్టర్‌లు సిద్ధం చేసాం. చిత్తూరు, కర్నూలు, తిరుపతి, ప్రకాశం, ప్రాంతాలను ముందుగా అప్రమత్తం చేశాం. ప్రతి మండలంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిద్ధం చేస్తున్నాం. గంట గంటకు ఎంత వర్షపాతం నమోదు అయిందో పర్యవేక్షిస్తున్నాం. సెలవుల్లో ఉన్న అధికారులు కూడా విధుల్లోకి వస్తున్నారు. డ్రోన్స్ కూడా వినియోగిస్తున్నాం.