బోధన్‌ లో పిచ్చి కుక్క దాడి.. 12 మందికి గాయాలు

బోధన్, ఆగస్ట్ 21: బోధన్ పట్టణంలో పిచ్చి కుక్క ఒకటి స్వైర విహారం చేస్తూ 12 మందిని గాయపరిచింది.  తట్టికోట, కుమార్గల్లి తదితర ప్రాంతాలలో ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన వారిలో ఒక నాలుగు సంవత్సరాల బాలుడితో పాటు రోడ్డుపై నడుస్తున్న గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారు. ఈ దాడి స్థానికులలో భయాందోళనకు గురిచేసింది.

దాడి అనంతరం గాయపడిన వారిని చికిత్స కోసం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందిన బాధితులు, వారి కుటుంబ సభ్యులు పిచ్చి కుక్కల బెడదను నివారించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనలో ఉన్న ప్రజలను సముదాయించారు. ప్రజలు పిచ్చి కుక్కల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.