కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు

– నేటి నుంచి స్వచ్ఛత హీ సేవా
– కమిషనర్‌ పులి శ్రీనివాసులు

గుంటూరు, మహానాడు: నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల వెంబడి ఉన్న కొబ్బరి బోండాల, టిఫిన్, టీ విక్రయదారులు వ్యర్ధాలను రోడ్ల మీద, డ్రైన్లలో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, జిటి రోడ్, సంపత్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వివిధ వ్యాపారాలు చేసే వారు వ్యర్ధాలను రోడ్ల మీద, కాల్వల్లో వేస్తున్నారని, ప్రధానంగా కొబ్బరి బోండాలు డ్రైన్లలో వేయడం వలన మురుగు పారుదలకు అద్దంకిగా ఉంటుందన్నారు. వ్యర్ధాలు డ్రైన్లలో వేసే వారీపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా భారీ మొత్తంలో అపరాధ రుసుం విదిస్తామని స్పష్టం చేశారు. డ్రైన్లలో మురుగు పారుదల లేకుంటే స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, వర్షాలకు వచ్చే నీరు కూడా ఇళ్ళల్లోకి వస్తుందన్నారు.

శాంతి నగర్, సంపత్ నగర్ ల్లో స్థానిక ప్రజల నుండి అందిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఆయా విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికంగా ఉండే వార్డ్ సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా నిర్దేశిత సమయాల్లో విధుల్లో ఉండాలని ఆదేశించారు. మంగళవారం నుండి ప్రారంభం కానున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాల నిర్వహణకు సచివాలయం వారీగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలన్నారు. పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, టిపిఎస్ లక్ష్మణ స్వామి, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.