దర్శి అభివృద్ధికి కృషి

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: దర్శి పట్టణానికి మౌలిక వసతులు సమకూర్చి సుందరంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దర్శి అభివృద్ధికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. పట్టణంలో పొదిలి రోడ్డు, గంగవరం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్స్, 19వ వార్డు పుచ్చలమెట్టలో డివైడర్ల పై ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లను ఆమె బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

పట్టణ ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించి కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా నిరూపిస్తామన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, లైటింగ్ ఏర్పాటు చేసి పార్కులను సుందరంగా తీర్చిదిద్ది, శాశ్వత మంచినీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, యువనేత, మనస్ఫూర్తి ప్రదాత విద్యా శాఖ మంత్రి లోకేష్ నిరంతర కృషితో సంక్షోభం నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని చెప్పారు. జిల్లా మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో దర్శి ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేష్, కౌన్సిలర్లు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.