విద్యార్థినులూ.. ఒత్తిళ్ళకు లొంగద్దు

– కోల్ కతా ఘటనలు పునరావృతం కాకూడదు
– దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీలో కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు, మహానాడు: విద్యార్థినిలు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు… కోల్ కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

గుంటూరులోని స్థానిక కమ్మ జన సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం చేతన్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ సంయుక్త నేతృత్వంలో జరిగిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొని, మాట్లాడారు. 60 మందితో ప్రారంభమైన ఈ సేవా సమితి ప్రస్తుతం 1600 మంది విద్యార్థులకు ఉపయోగపడుతోందన్నారు. ఇలాంటి ఒక సంస్థను స్థాపించాలంటే కేవలం డబ్బు ఉంటేనే సరిపోదని సంకల్పం, తపన, ఆశయంతో కూడుకున్న ఆలోచన ఉన్నప్పుడే ఆచరణ సాధ్యమవుతాయని వివరించారు.

చట్టసభల్లో ఒక సమర్ధవంతమైన నాయకత్వం ఉండాలన్న లక్ష్యంతోనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. విద్యార్థినులు ఎవరో చెప్పారనో, ఒత్తిడి చేశారనో తమ నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరంలేదు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడొద్దు. మహిళలు ఎదుటి వ్యక్తులకు స్ఫూర్తిగా ఉండాలే తప్ప ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకూడదు. నా శక్తి మేరకు ఈ రాష్ట్రానికి, దేశానికి ఎంత సేవ చేయగలనో అంతా చేస్తాను అని పెమ్మసాని పేర్కొన్నారు.

అనంతరం చేతన ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు పెమ్మసాని తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కుట్టు మిషన్లు, గ్రైండర్లు, తోపుడుబండ్లను అర్హులకు అందజేశారు. అర్హులైన 180 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ. 10-15 వేల చొప్పున ఉపకార వేతనాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో చేతన గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ళ రవికుమార్, బెటర్ వాషింగ్టన్, తెలుగు కల్చరల్ సంఘం ప్రెసిడెంట్ లామ్ శ్రీకృష్ణ, బ్రెజిల్ ఈ ఫౌండేషన్ ప్రోగ్రాం అడ్వైజర్ మజ్జిగ కేశవ కిషోర్ కుమార్, కమ్మ జన సేవా సమితి సెక్రటరీ చుక్కపల్లి రమేష్ రోటరీ క్లబ్ గుంటూరు సెంటెన్షియల్ ప్రెసిడెంట్ పి.సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు