– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
వినుకొండ, మహనాడు: విద్యార్థినీవిద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆకాంక్షించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థినీవిద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ టి. ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూల్స్ కి మాత్రమే పరిమితమైన ఈ పంపిణీ.. ఇక నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు కూడా వర్తింపచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారని వెల్లడించారు.
ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని శ్రద్ధగా విద్యనభ్యసించాలని సూచించారు. అనంతరం కళాశాలలో విద్యార్థులు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని కోరగా.. మంత్రి దృష్టికి తీసుకొని వెళతానని చెప్పారు. మరో విద్యార్థిని బొల్లాపల్లి మండలం కనుమలచెరువుకు బస్సును సాయంత్రం పూట ఏర్పాటు చేయాలని విన్నవించగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆంజనేయులు.. డిపో మేనేజర్ కోటేశ్వర నాయక్ తో ఫోన్ లో మాట్లాడి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.