పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు న్యూస్: పల్నాడు జిల్లా ప్రజాగళం పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలో బసచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతలతో వరుస సమావేశాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపారు. అయితే ఇంతమంది నేతల మధ్య ఒక్క నేత రాక మాత్రం అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ నేత మరెవరో కాదు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ, ప్రస్తుతం విజయవాడ పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న యలమంచిలి సుజనా చౌదరి. ఆయన రాకను ఎవరూ ఊహించలేదు.
అనూహ్యంగా చంద్రబాబు బస చేసిన ప్రాంగణంలోకి ఆయన కారు రావడంతో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. బాబు భోజన విరామ సమయంలో వచ్చిన ఆయన మళ్లీ వెనక్కి వెళ్లి కొంత సమయం తీసుకుని అనంతరం నర్స రావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, కన్నా లక్ష్మీనారాయణతో కలిసి చంద్రబాబును కలిసేందుకు లోపలికి వెళ్లారు. అయితే ఆదివారం చంద్రబాబు ప్రజాగళం పర్యటన కృష్ణా జిల్లాలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పర్యటన గురించి చర్చించేందుకు సుజనా చౌదరి సత్తెనపల్లి వచ్చి ఉంటారని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం అనంతరం బయటకు వచ్చిన సుజనా చౌదరితో ఫొటోలు దిగేందుకు టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పోటీలు పడ్డారు. వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు.