సునీల్‌ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాల్సిందే

– సొంత సంస్థ ముసుగులో పాలకపార్టీలను ప్రలోభపెట్టే సునీల్
– సునీల్ ఈ సర్కారుపైనా అదే డ్రామా ప్లే చేస్తున్నారేమో?
– కానీ మా సీఎం అంత అమాయకులు కాదు
– విజయపాల్‌ను పట్టుకోలేకపోవడం పోలీసుల బాధ్యతారాహిత్యం
– ఇదంతా దొంగ పోలీస్ ఆట మాదిరిగా ఉంది
-సీతారామాంజనేయులు సస్పెన్షన్ తో సంతృప్తి చెందా
– ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయం
-జత్వాని ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆధారాలు సేకరించి సస్పెండ్
– డీజీ, ఐజి స్థాయి పోలీసు అధికారులతో పాటు, ఎస్పీ నుంచి డీఐజీగా ప్రమోషన్ పొందనున్న అధికారి గున్ని కూడా సస్పెండ్
– త్వరలోనే వీరిని అరెస్ట్ చేసే ఛాన్స్… వీళ్లకు తప్పకుండా శిక్ష పడుతుంది
– ఆకృత్యాలను అడ్డుకోవలసిన పోలీసు అధికారులే అకృత్యాలను చేయడం ఈ ప్రభుత్వం సహించదు
– ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల వ్యక్తి కాదని, చేతల వ్యక్తని మరోసారి రుజువయింది
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ఉండి: ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఉండి శాసనసభ్యులు రఘు రామ కృష్ణంరాజు అన్నారు. ఇప్పటివరకు ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఎవరు కూడా ఏకకాలంలో సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. ఇదొక సాహసోపేతమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ను సస్పెండ్ చేయడం పట్ల తాను సంతృప్తి చెందానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నా కేసులో ఉన్న ముగ్గురు అధికారులలో, ఒకరిపై చర్యలు తీసుకున్నట్లుగా భావిస్తున్నానన్నారు.

పీవీ సునీల్ కుమార్ దారుణమైన నేరస్తుడని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, తన ప్రమోషన్ కోసం చాలా దారుణంగా వ్యవహరించిన తీరు, వర్ణించడానికి మాటలు లేవన్నారు. నా కేసులో అతని పాత్ర స్పష్టమని, పోలీసులకు కూడా వివరాలు తెలుసునన్నారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి విజయ్ పాల్ కూడా జత్వాని కేసులో విశాల్ గున్ని తరహాలో వ్యవహరించారన్నారు.

ఈ కేసులో విజయ్ పాల్ ను పట్టుకుంటే, అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. విజయ్ పాల్ రిటైర్డ్ అధికారి అని అతన్ని సస్పెండ్ చేయాలనడం సమంజసం కాదన్నారు. విజయ్ పాల్ పరారీలో ఉండగా ఇప్పటివరకు పట్టుకోకపోవడం అన్నది పోలీసుల బాధ్యత రాహిత్యమన్నారు. విజయ్ పాల్ ను పట్టుకోవాలంటే పోలీసులు పది నిమిషాలలో పట్టుకోగలరన్నారు. ఇదంతా దొంగ పోలీస్ ఆట మాదిరిగా ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

ఎఫ్ఐఆర్ లో పీవీ సునీల్ కుమార్ పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొన్న ఆయన, మొన్న కంప్లైంట్ ఇస్తే నిన్న కేసు పెట్టలేదన్నారు. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. సునీల్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్న ఆయన తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. ఇప్పటివరకు పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయకపోవడం బాధాకరమన్నారు.

ఇటీవల వరదలపై కూడా పీవీ సునీల్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేశారన్నారు. సునీల్ కుమార్ కు అనైతికంగా ఒక స్వచ్ఛంద సంస్థ ఉందని పేర్కొన్న ఆయన, ఐపీఎస్ అధికారులు సర్వీస్ రూల్స్ ప్రకారం స్వచ్ఛంద సంస్థలను నడపడానికి వీలు లేదన్నారు. గతంలో ఎన్నోసార్లు నేను ఇదే అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి, పీవీ సునీల్ కుమార్ కు వంతపాడి కొమ్ముకాశారన్నారు.

ఎయిమ్ అనే ఎయిమ్‌లెస్ సంస్థను నిర్వహిస్తూ, నాకు లక్షలాదిమంది మద్దతుదారులు ఉన్నారని, ఇన్ని ఓట్లను వేయించ గలనని రాజకీయ నేతలతో బేరసారాలను కొనసాగిస్తారు. ఈ ప్రభుత్వంపై కూడా అటువంటి ప్రయోగం ఏమైనా చేశారేమో నాకు తెలియదు. అటువంటి సర్వైవల్ మంత్రాన్ని ప్రయోగించడంలో పీవీ సునీల్ కుమార్ సిద్ధహస్తుడని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మే వ్యక్తి కాదన్నారు.

అది నా పరిపూర్ణ విశ్వాసం అని, నిన్న ఒక వికెట్ సస్పెన్షన్ రూపంలో కూలిందని, రానున్న రెండు రోజుల్లో పీవీ సునీల్ కుమార్ పేరు కూడా, సస్పెన్షన్ లిస్టులో ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పి వి సునీల్ కుమార్ రాజకీయాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి పై పనిచేస్తాయని, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై పనిచేయవన్నారు.

అతని క్యాస్ట్, రిలీజీయన్ చూసి భయపడుతున్నారా? అని నన్ను కొంతమంది రాజకీయ నాయకులు ప్రశ్నించారన్నారు. నేరం ఎవరు చేసినా నేరమేనని, నేరానికి కులం మతం లేదన్నారు. ఈ వారంలో సునీల్ కుమార్ సస్పెన్షన్ ఉంటుందని విశ్వసిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. సీతారామాంజనేయులు గతంలో విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, ఖమ్మం జిల్లాలలో పనిచేశారని, అతనిపై గతంలో ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయన్నారు. గతంలో వార్తాపత్రికలను చూసి కమ్యూనిస్టు నాయకులు ఒక అంచనాకు వచ్చి ఉంటారన్నారు.

డీజీపీ నోట్ పెట్టిన వెంటనే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు ఐపీఎస్ సీనియర్ అధికారులను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. డీజీ, ఐజి స్థాయి అధికారులతో పాటు, ఎస్పీ నుంచి డిఐజి హోదా కు పదోన్నతి పొందనున్న విశాల్ గున్ని అనే అధికారిని సస్పెండ్ చేశారన్నారు. వీరిని అరెస్టు కూడా చేసే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు.

సోమవారం నాడు ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కాదంబరి జత్వాని అనే సినీ నటిని దారుణంగా హింసించడంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. ముంబై నుంచి ఆమె ను అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతల మెప్పు పొందేందుకు అక్రమంగా ఎత్తుకొచ్చారన్నారు.

అబ్బెబ్బే ఆమెను ఎత్తుకు రాలేదని, అక్కడి నుంచి తీసుకువచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరు పరచామని సాక్షి దినపత్రికలో రాశారన్నారు. ఇదంతా మేనేజ్మెంట్ సర్వీసని నేమ్ సెక్ కు ఉంటుందని… ఇవన్నీ తెలిసిన వ్యవహారాలనే, మేజిస్ట్రేట్ ను కూడా బెదిరిస్తారన్నారు. ఇవన్నీ నేను పడిన వాడిని కదా…నాకంటే బాగా ఎవరికి తెలుసనన్నారు.

అంతా ఫ్రాడ్ అని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, ఆ అమ్మాయి (కాదంబరీ జత్వాని ) ని ఎత్తుకొచ్చి హింసించారన్నారు. కాదంబరి జత్వాని తన ఫిర్యాదులో చెప్పలేని ఎన్నో విషయాలు తనకు ఇతరుల ద్వారా తెలిశాయన్నారు. ఇటీవల జత్వాని, ముగ్గురు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేసి వారి పాత్ర గురించి వివరించిందన్నారు. పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు.

పోలీసులు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్రపై విచారణ జరిపి, కిందిస్థాయి అధికారుల వద్ద నుంచి సాక్ష్యాధికారాలను సేకరించి, వారిపై చర్యలకు సిఫార్సు చేయడం జరిగిందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందే ఈ పనికిమాలిన వాళ్ళు ముందస్తుగానే ముంబై విమానానికి టికెట్లు బుక్ చేసుకుని, కాదంబరి జత్వాని ని ఎత్తుకొచ్చారు.

అలాగే నా కేసులోనూ సేమ్ టు సేమ్ వ్యవహరించారని తెలిపారు. నా కేసులో ఎఫ్ఐఆర్ ఉదయం 10 గంటలకు నమోదైతే, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే రెండు రోజుల ముందే నన్ను ఎత్తుకు రావాలని ప్లాన్ చేశారన్నారు. అలాగే జత్వానిని ఎత్తు రావడానికి ముందుగానే విమాన టికెట్లను బుక్ చేసుకున్నారని తెలిపారు. రంజాన్ పండుగ సెలవు దినం రోజే నన్ను ఎత్తుకు వచ్చేందుకు ప్లాన్ చేశారని వెల్లడించారు.

మొన్నటిదాకా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కేసును చంద్రబాబు నాయుడు ఆలస్యం చేస్తున్నారని, అన్యాయం చేస్తున్న వారిని ఉపేక్షించడం సరి కాదని చాలామంది మాట్లాడడం జరిగిందన్నారు. అన్నిటికీ దీటుగా సమయం రావాలి. పద్ధతి ప్రకారం జరగాలి. కక్షతో జరగకూడదని, విజయవాడ కమిషనర్ చేత విచారణను డీటెయిల్ గా చేయించడం జరిగిందన్నారు. అవన్నీ ఫ్రాడ్ అని తేలిన తర్వాత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఫేక్ అని తేలింది అన్నారు.

ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించి, చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. హడావడి చేయకుండా, చాలా పద్ధతి ప్రకారం చర్యలు తీసుకొని ప్రజల్లో ధైర్యం, ధైర్యం కల్పించడం జరిగిందన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను ఉపేక్షించేది లేదని నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు స్పష్టమైన సంకేతాలను ఇచ్చారన్నారు .

సీనియర్ ఐపీఎస్ అధికారులు క్యాట్ కు, కోర్టుకు వెళ్లిన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడిన సీనియర్ ఐపీఎస్ లకు శిక్ష తప్పదని హెచ్చరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు చేసిన అక్రమాలు పోలీసు వ్యవస్థకు మాయ మచ్చగా మిగిలిపోతుందని, ఎవరు తప్పు చేసినా డీజీ స్థాయి అధికారి అయిన ఆకృత్యాలు చేశారంటే, ఈ ప్రభుత్వం శిక్షిస్తుందన్న సంకేతాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల వ్యక్తి కాదు… చేతల వ్యక్తి అని చేసి చూపించారన్నారు. తెదేపా కార్యకర్తలు అందరికీ ధైర్యాన్ని కలిగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

జత్వాని కేసులో పురోగతి ఉన్నట్టుగా, మీ కేసులో ఎందుకు లేదన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు, ఆడపిల్లల కేసులో స్పీడు లేకపోతే దారుణమైన చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎంత స్పీడ్ గా కేసు పరిష్కారం చేస్తే అంత మంచిది అన్నారు.. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసిన కేసు సంగతి ఏమిటన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు.. ఎఫ్ఐఆర్ నమోదయి రెండు నెలలు దాటిందన్నారు. జూలై 11వ తేదీన ఫిర్యాదు తర్వాత, 30 రోజులు అనంతరం కేసు నమోదయిందన్నారు.