– నూజివీడులో స్మారక కేంద్రం
– నాగాయలంకలో బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
– ఆగిరిపల్లిలో డాక్టర్ సూరి భగవంతం 115 జయంతి వేడుకలో మంత్రి పార్థసారథి
ఏలూరు, మహానాడు: భారత రక్షణ క్షిపణి రంగంలో ప్రపంచంలో మొదటి మూడు స్థానాలలో భారతదేశం నిలపడంలో డాక్టర్ సూరి భగవంతం పాత్ర ఎంతో ప్రముఖమైనదని, అటువంటి వ్యక్తి ఈ ప్రాంతం వారు కావడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శ్రీ శోభనాద్రి లక్ష్మీ నరసింహ వేద శాస్త్ర పాఠశాల ఆవరణలో డీఆర్డీవో పూర్వపు డైరెక్టర్ జనరల్, రక్షణ శాఖ మంత్రి పూర్వ శాస్త్ర విజ్ఞాన సలహాదారు డాక్టర్ సూరి భగవంతం 115వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, డీఆర్డీవో పూర్వపు చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డిలతో కలిసి మంత్రి పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. దేశ రక్షణ శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచపటంలో భారత దేశం ప్రముఖ స్థానంలో నిలపడంతో భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం, సూరి భగవంతం వంటి వారు వేసిన పునాదులేనన్నారు.
130 కోట్ల మంది భారతీయులు భయం లేకుండా జీవిస్తున్నామంటే ఇటువంటి మహనీయులు దేశరక్షణ కు చేసిన కృషే కారణమన్నారు. అటువంటి వారి జీవితాలను ప్రతీ ఒక్కరూ స్మరించుకునేలా వారి జీవిత విశేషాలు తెలియజేసే విధంగా నూజివీడులో సూరి భగవంతం స్మారక కేంద్రాన్ని పెద్దస్థాయిలో ఏర్పాటు చేస్తానని, ఈ కేంద్రంలో ఆయన జీవిత చరిత్ర, వారు రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన విజయాలు ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో విశిష్ట కృషి చేసిన వారిని ప్రతీ సంవత్సరం ఎంపిక చేసి, సూరి భగవంతం పేరుమీదుగా అవార్డు ప్రధానం చేసేందుకు ట్రస్ట్ నెలకొల్పాలన్నారు. ఇందుకు తాను 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేస్తున్నామని మంత్రి ప్రకటించారు.
దేశ రక్షణలో ప్రధానపాత్ర వహించే బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నాగాయలంక సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, ఇందుకు కృషి చేసిన జి.సతీష్ రెడ్డి ని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. శ్రీ శోభనాద్రి లక్ష్మీ నరసింహ వేద శాస్త్ర పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, పాఠశాల ప్రతినిధులు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతితో జన్మించిన మహానీయులను గుర్తించి, వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సూరి భగవంతం నోబుల్ బహుమతి గ్రహీత డాక్టర్ సీవీ రామన్ ప్రియ శిష్యులని, బెంగుళూరు లోని టాటా ఏరోస్పేస్ రక్షణ సంస్థకు రామన్ అనంతరం డైరెక్టర్ అయ్యారన్నారు. సూరి భగవంతం నిర్వహించిన పదవులను వారి అనంతరం సతీష్ రెడ్డి నిర్వహించారన్నారు. నాగాయలంక కు రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరుచేయడంలో సతీష్ రెడ్డి పాత్ర ప్రధానమైనదని, ఈ కేంద్రం ఏర్పాటుతో కృష్ణా జిల్లా దశ, దిశ మారుతుందన్నారు.
సతీష్ రెడ్డి మాట్లాడుతూ సూరి భగవంతం 1961లో తొమ్మిదేళ్ళు కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారన్నారు. సరిహద్దుల్లో ఉన్న శత్రుదేశాల నుండి దేశానికీ ముప్పు వాటిల్లకుండా హిమాలయాల్లో, ఈశాన్య రాష్ట్రాలైన లెహ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రయోగశాలలను ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారన్నారు. రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ముందు వరసలో నిలబెట్టిన ఘనత సూరి భగవంతంకు దక్కుతుందన్నారు.
ఆయన హయాంలో 25 ప్రయోగశాలలు ఏర్పాటుచేశారన్నారు. సూరి భగవంతం ఎంతో ముందు చూపుతో దేశ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకున్నారని, దేశం రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడంలో సూరి భగవంతం పాత్ర ప్రముఖమైనదన్నారు. 2023-24 సంవత్సరంలో 24 వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేశామని, ఇందుకు సూరి భగవంతం రక్షణ శాస్త్ర సాంకేతిక రంగంలో వేసిన బీజమే కారణమన్నారు.
అనంతరం సూరి భగవంతం జీవిత చరిత్రపై ప్రచురించిన ” వైజ్ఞానిక క్రాంతి కిరణం” బ్రోచర్ ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డిని, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తదితరులను మంత్రి సన్మానించారు. అనంతరం సతీష్ రెడ్డి మంత్రి కొలుసు పార్థసారథిని పూలమాల, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి వేద పాఠశాల ఆవరణలో గో పూజ చేశారు.
కార్యక్రమంలో సూరి భగవంతం ఫౌండేషన్ ఫౌండర్, డైరెక్టర్ ఎస్.బి. రామ్, నేషనల్ బుక్ ట్రస్ట్ సభ్యుడు జి.వల్లీశ్వర్, నూజివీడు ఆర్డీవో వాణి , పంచాయతీ రాజ్ ఈఈ బాపురెడ్డి, వేద పాఠశాల కార్యవర్గ సభ్యులు సూరి శర్మ, సలాక రఘునాథ శర్మ, దోర్బల ప్రభాకర శర్మ, ప్రభృతులు పాల్గొన్నారు.