శ్రీశైలం, మహానాడు: భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో కొండచరియలు పడుతున్న నేపథ్యంలో మన్ననూరు చెక్ పోస్ట్ నుంచి శ్రీశైలానికి వాహన రాకపోకలు నిలిపివేశారు. ఈ మేరకు అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ప్రస్తుతానికి శ్రీశైలం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వాయిదా వేసుకోవాలని సూచించారు. యాత్రికులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. కాగా, అల్ప పీడనం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల పొలాలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీ,కొత్తపేట ఏరియాలో రోడ్లన్నీ జలమయమై వాగులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. సున్నిపెంటల ఓ రెండు గృహాలపై భారీ వేపచెట్టు కూలి గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న వారికి ప్రాణాపాయం తప్పింది.