స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవ 2024

– రాష్ట్ర స్ధాయి నోడల్ ఏజెన్సీగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్
– స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు

అమరావతి : స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహిస్తున్నామని స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన అవశ్యకత ఉందన్నారు.

రాష్ట్ర స్ధాయిలో భాగస్వామ్య సంస్ధలతో శనివారం హైబ్రీడ్ విధానంలో ఉన్నత స్ధాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ పదో వార్షికోత్సవం, స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి పోతుందన్నారు.

మహాత్ముడి జయంతి వేళ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీని స్వచ్ఛ భారత్ దివస్‌గా పాటిస్తున్నామన్నారు. “స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత” ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవ 2024ను నిర్వహించుకుంటున్నామన్నారు.

స్వచ్ఛతా కీ భాగీదారి విభాగంలో తగిన ప్రచారంతో ప్రజల భాగస్వామ్యాన్ని, అవగాహనను ప్రోత్సహించడానికి మారథాన్‌లు, సైక్లోథాన్‌లు, మానవ గొలుసులు నిర్వహిస్తామన్నారు. మొక్కల పెంపంకంతో పాటు ఇతర సుందరీకరణ పనులు చేపట్టవలసి ఉందన్నారు. స్వచ్ఛత లక్షిత్ ఏకాయి – సంపూర్ణ స్వచ్ఛత విభాగంలో అధిక జనసాంద్రత కలిగిన ప్రదేశాలలో సామూహిక పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతూ, పరిశుభ్రత లక్ష్య సాధన కోసం ప్రత్యేకించి ఒక ప్రాంతాన్ని లేదా పారిశుధ్య సమస్యను ఎంపిక చేసుకుని దానికి పరిష్కారాన్ని చూపుతామన్నారు.

సఫాయిమిత్ర సురక్ష విభాగంలో పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం, గౌరవాన్ని కాపాడేలా విభిన్న కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆరోగ్యశిబిరాల నిర్వహణ, సంక్షేమ పథకాల లబ్దికి ఏకగవాక్ష విధానాన్ని అమలు చేయటం వంటివి ఉంటాయన్నారు. వారికి ప్రత్యేకంగా భద్రతా శిక్షణలు పిపిఇ కిట్లు అందిస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర స్ధాయి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని గంధం చంద్రుడు వివరించారు.