స్వామీ.. నీ సొమ్ములు భద్రమేనా?

– శ్రీవారి కల్యాణోత్సవాల నగలు పరిశీలించారా?
– సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారా? లేదా?
– అవి అసలువా? గిల్టువా?
– గిల్టువైతే భక్తులను మోసం చేసినట్లే కదా?
– జగన్ జమానాలో జ్యువెలరీ సెక్షన్‌ను చెల్లాచెదరు చేశారా?
– నగల నిజాలు తెలియకూడదని జాగ్రత్త పడ్డారా?
– ఇప్పుడు శ్రీవారు, అమ్మవారి నగలు నిజమైనవేనా?
– నెయ్యి ఎపిసోడ్‌తో నగల భద్రతపైనా అనుమానాలు
– నగల నాణ్యతను గతంలో అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చిన ఆర్‌బీఐ
– వైఎస్ జమానాలో అవుట్‌సోర్సింగ్ చేతికి నగల నాణ్యత బాధ్యత
– శ్రీవారి నగలు పరీక్షించాలంటున్న భక్తకోటి
( మార్తి సుబ్రహ్మణ్యం)

దేనిపైనయినా సరే.. ఒకసారి అనుమానం వచ్చి, అది నిజమని తేలిన తర్వాత ఇక ప్రతిదానినీ అనుమానించటం మానవనైజం. అది వక్తులయినా, వ్యవస్థలకయినా సరే. టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం నిజమేనని తేలిన నేపథ్యంలో.. ఇప్పుడు టీటీడీలో కొలువైన శ్రీవారు, అమ్మవారి నగలు అసలువేనా? లేక ఆ స్థానంలో రోల్డుగోల్డువి అలంకరించారా? అసలు టీటీడీ హుండీలో భక్తులు వేస్తున్న బంగారం భద్రమేనా? వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఏం చేస్తున్నారు? జగన్ జమానాలో జ్యువెలరీ సిబ్బందిని చెల్లాచెదురు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకొచ్చింది? అంటే ఇదంతా జ్యువెలరీ పూర్తి సమాచారం ఉద్యోగులకు తెలియకూడదన్న ఎత్తుగడేనా? కాబట్టి శ్రీవారు-అమ్మవారి నగల భద్రత, ఇప్పటి నాణ్యతను కచ్చితంగా పరీక్షించాల్సిందేనన్నది.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన వెంకన్న భక్తికోటి వాదన.

తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులు, హుండీలో డబ్బులతోపాటు బంగారం కూడా సమర్పిస్తుంటారు. చాలామంది నిలువుదోపిడీ కూడా ఇస్తుంటారు. ఆవిధంగా హుండీలో ఆర్నమెంటు, డైమండ్, బిస్కట్లు కానుకలుగా సమర్పిస్తుంటారు. అంటే 18, 22,24 క్యారెట్ల బంగారం వస్తుంటుందన్నమాట. ఆరకంగా రోజుకు 2 కిలోల బంగారం స్వామివారికి కానుకగా వస్తున్నాయి. దీనిని విడదీసి, రాళ్లను వేరుచేయాల్సి ఉంటుంది. వచ్చిన బంగారాన్ని నమోదు చేసి, దానిని ఆర్‌బిఐకి పంపుతారు.

అయితే వైఎస్ హయాంలో అంటే 2006-2208 మధ్య కాలంలో ఈ నగల లెక్కింపు, నాణ్యత, రాళ్లు వేరు చేసే వ్యవహారాన్ని ఆర్బీఐ.. ఒక అవుట్‌సోర్సింగ్ కు ఇచ్చిన వైనం బయటపడి, వివాదంగా మారింది. బయటవారికంటే ప్రభుత్వ సంస్థ అయిన ఆర్బీఐ ఎక్కువ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించిన సందర్భంలో, అసలు విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఆర్బీఐ వద్ద బంగారానికి సంబంధించిన ప్రత్యేక వ్యవస్ధ లేదు. దానితో అవుట్‌సోర్సింగ్ సంస్ధ చెప్పిందే వేదంగా ఉండేది. తర్వాత వచ్చిన బంగారం కరిగించి, బ్యాంకులో భద్రం చేసేవారు. అప్పుడు ఆలయంలో నగల లెక్కింపు సమయంలో, నగలకు సంబంధించి రాళ్లు మాయమయ్యేవన్న ఆరోపణలు కూడా వచ్చేవన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు నెయ్యిలో.. జంతుకళేబరాల కొవ్వు వాడుతున్నారన్న నిజం బయటప్రపంచానికి తెలిసిన తర్వాత, సహజంగానే స్వామివారు-అమ్మవారి నగల భద్రత-నాణ్యతపై సందేహాలు తెరపైకి వ స్తున్నాయి. ఆ ప్రకారంగా ఇప్పుడు స్వామివారు-అమ్మవారి విగ్రహాలపై ఉన్న నగలు అసలైనవా? వాటిని మార్చివేసి వాటి స్థానంలో గిల్టునగలు అలంకరించారా? ఎందుకంటే అన్యమతస్తులు టీటీడీ చైర్మన్లుగా ఉన్నారని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడే వ్యాఖ్యానించినందున.. స్వామివారు-అమ్మవారి నగల భద్రతపైనా అనుమానాలు తెరపైకి వచ్చేందుకు కారణమయ్యాయి.

ఇదిలాఉండగా..ధర్మారెడ్డి పగ్గాలందుకున్న తర్వాత జ్యువెలరీ సెక్షన్‌లో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న అధికారులు-సిబ్బందిని, చెల్లాచెదురు చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సహజంగా ఒక విభాగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులు-సిబ్బందికి ఆ విభాగంపై పూర్తిస్థాయి సమాచారం- పట్టు ఉంటుంది. అంతర్గత విషయాలు కూడా సులభంగా తెలుస్తుంటాయి. ఇది ఎక్కడైనా జరిగేదే.

ఈ సూక్ష్మం గ్రహించినందుకే.. జ్యువెలరీ సెక్షన్‌లో, కొత్తగా ఎలాంటి సమాచారం తెలుసుకునే వీలులేకుండా చేసేందుకే, అందులో పనిచేసే అధికారులు-సిబ్బందిని పూర్తి స్థాయిలో ఇతర విభాగాలకు బదిలీ చేశారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానితో జ్యువెలరీ విభాగంలో ఏం జరుగుతోందో, బయట ప్రపంచానికి తెలుసుకునే మార్గాలను.. విజయవంతంగా-వ్యూహాత్మకంగా మూసేశారని చెబుతున్నారు.

ఇక జగన్ జమానాలో ఢిల్లీ, హైదరాబాద్,ముంబయి, బెంగళూరు, చెన్నైలో శ్రీవారి కల్యాణోత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఆ సందర్భంలో ఉత్సవమూర్తులకు నగలు అలంకరించారు. తిరుమలలో శ్రీవారికి ఎలాంటి నగలయితే అలంకరిస్తారో, బయట రాష్ట్రాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లోనూ స్వామివారికి అవే నగలు అలంకరించారు. దానితో భక్తులు అవి నిజమైనే నగలేనని, కొండపైనున్న స్వామివారే తమ వద్దకు వచ్చారన్న తాదాత్మ్యంతో పులకించిపోయారు.

అయితే బయట రాష్ట్రాల్లో నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవంలో, స్వామివారి విగ్రహానికి అలంకరించిన నగలు, గిల్టువన్న ప్రచారం తర్వాత జరిగింది. దానిపై అప్పటి అధికారులెవరూ స్పష్టత ఇవ్వలేదు. నిజంగా అవి అసలు నగలైతే.. వాటి తరలింపు సందర్భంలో టీటీడీ అధికారులేమైనా పోలీసు రక్షణ కోరారా? వాటిని తరలించే సమయంలో నగల వివరాలు నమోదు చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఒకవేళ అవి గిల్టు నగలయితే, స్వామి వారి భక్తులను మోసం చేసినట్లే లెక్క.

నిజానికి మాడవీధుల్లో జరిగే ఊరేగింపు సమయంలోనే శ్రీవారి బంగారు నగలు అలం రిస్తారు. వాటిని బయటకు తీసుకువచ్చినప్పుడు నగల వివరాలు నమోదు చేసి, తిరిగి అదే స్థానంలో ఉంచే ముందు కూడా, వాటిని నమోదు చేస్తారు. అయితే బయట రాష్ట్రాల్లో నిర్వహించే కల్యాణోత్సవాల్లో మాత్రం, స్వామివారికి అలంకరించే నగలన్నీ, సహజంగా గిల్టువే ఉంటాయని టీటీడీ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు.

తాజాగా ఇప్పుడు కల్తీ నెయ్యి ఆరోపణలు ధృవపడిన నేపథ్యంలో.. స్వామివారి కల్యాణోత్సవాల్లో అలంకరించిన ఆ గిల్టు నగలనే, కొండపైనున్న శ్రీవారికి అలంకరించి, అసలువాటిని మాయం చేశారా? అన్న సందేహాలు భక్తకోటిలో సహజంగానే తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో, భక్తుల అనుమానాలు నివృతి చేసేందుకు, స్వామివారు-పద్మావతి అమ్మవారి నగలను పరీక్షించడమే మంచిదన్నది హిందూసంస్ధల వాదన.

వాటితోపాటు.. అసలు టీటీడీలో ఉన్న నగల భద్రత ఎంతన్నదానిపైనా తనిఖీలు నిర్వహించి, భక్తుల అనుమానాలకు తెరదించడం మంచిదన్న సూచన వ్యక్తమవుతోంది. సహజంగా ప్రతి ఏడాది స్వామివారి నగలపై ఆడిట్ జరుగుతుంది. కానీ నెయ్యి సరఫరాలో అపచారం జరిగిందన్న నిర్ధరణ నేపథ్యంలో, నగలపై వస్తున్న అనుమానాలకూ తెరదించడం మంచిది.

‘‘ నెయ్యిలో అపచారం జరిగిందని తేలినందున, శ్రీవారు-పద్మావతి అమ్మవారి నగలభద్రతపై ఇప్పడు అనుమానాలు రావడం సహజం. కానీ అలా జరగదన్నది నా విశ్వాసం. జరగకూడదన్నది భక్తుడిగా నా కోరిక. కానీ అప్పటి అధికారులు, చైర్మన్లను నమ్మలేం. ఎందుకంటే తాము బయట రాష్ట్రాల్లో శ్రీవారి కల్యాణం జరిపించామని మాజీ చైర్మన్ భూమన గర్వంగా చెబుతున్నారు. అందువల్ల బయట రాష్ట్రాలకు తీసుకువెళ్లిన ఆ గిల్టు నగలనే తెచ్చి కొండపై ఉన్న స్వామివారికి, అమ్మవారికి అలంకరించి, అసలు వాటిని మాయం చేశారమోనన్న అనుమానం, భావన భక్తులకు ఉండటం సహజం. దానిపై టీటీడీ ఈఓ స్పందించి, నగల నాణ్యతను తనిఖీ చేయడం ద్వారా ఈ అనుమానాలకు తెరదించడం మంచిద’ని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్, టీడీపీ నేత డాక్టర్ ఓ.వి.రమణ వ్యాఖ్యానించారు.

వైఎస్ హయాంలో తాను టీటీడీ సభ్యుడిగా ఉన్నప్పుడు, నగల వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు, ఆర్బీఐ ఒక అవుట్‌సోర్సింగ్ కంపెనీకి ఇవ్వడంపై, జ్యువెలరీ కమిటీ సభ్యుడిగా తాను అభ్యంతరం వ్యక్తం చేశానని గుర్తు చేశారు.దీనికి సంబంధించి బోర్డులో జరిగిన వాగ్వాదం, ఓ దళిత ఎమ్మెల్యే నాపై కేసు పెట్టేవరకూ వెళ్లింది. అందుకు అప్పటి ఈఓ రమణాచారి, భూమన కరుణార్‌రెడ్డి సాక్షులు అని గుర్తు చేశారు.