– టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరితో ధర్మం గాడితప్పుతోంది
– ఆయన స్వామీజీలను అవమానించారు
– వైసీపీ హయాంలోనే స్వాములకు బోలెంత గౌరవం
– వెంకయ్య చౌదరితో భక్తులకు నిరాశ
– అర్జంటుగా ఆయనను మార్చేయండి
– సర్కారుకు శ్రీనివాసానంద సరస్వతి సూచన
– ఐదేళ్ల జగన్ పాలనపై తిరగబడ్డ తొలి పీఠాథిపతి శ్రీనివాసానంద
– ఎన్నికలకు ముందు కూటమికి ఆశీస్సులు
– ఆయన ఆరోపణలు ఖండించిన టీటీడీ
– ఆయన 50మంది స్వామీజీలకు బ్రేక్‌దర్శనం అడిగారు
– కుదరదన్నందుకే చౌదరిపై ఆరోపణలని వివరణ
– వివాదంలో వెంకయ్యచౌదరి వ్యవహారశైలి
(మార్తి సుబ్రహ్మణ్యం)
టీటీడీ అడిషినల్ ఈఓ వెంకయ్య చౌదరి వ్యవహారశైలి వివాదం పాలవుతోంది. గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వం, ఆయన గురువు స్వరూపానందపై బహిరంగ యుద్ధం చేసి.. కూటమికి ఆశీస్సులు అందించిన శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాథిపతి శ్రీనివాసానంద సరస్వతి.. ఇప్పుడు వెంకయ్య చౌదరిపై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. వెంకయ్య చౌదరి వల్ల ధర్మం గాడితప్పుతోందని విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలోనే స్వాములకు ఎనలేని గౌరవం దక్కిందన్న సంచలన వ్యాఖ్యలు చే యడం కలకలకం సృష్టిస్తోంది.
గత ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రత్యక్షంగా పోరాడేందుకు టీడీపీ,జనసేన వెనుకంజ వేసిన రోజుల్లో… వైసీపీ సర్కారుపై తొలి యుద్ధం ప్రకటించిన రాజకీయ నాయకుడు రఘురామకృష్ణంరాజయితే.. ఆధ్యాత్మిక ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక పీఠాథిపతి శ్రీనివాసానంద సరస్వతి. విశాఖ స్వరూపానందకు చెందిన శారదా పీఠం, వైసీపీ కార్యాలయమని బహిరంగంగా వ్యాఖ్యానించిన తొలి పీఠాథిపతి శ్రీనివాసానంద మాత్రమే. స్వరూపా పీఠానికి ఇచ్చిన భూములు రద్దు చేయాలని, తొలిసారి గళం విప్పిన పీఠాథిపతి కూడా ఆయనే కావడం గమనార్హం. ఆ తర్వాత ఏపీలో జరుగుతున్న మతమార్పిళ్లు, దానికి మద్దతునిస్తున్న జగన్ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త నిరనస ప్రదర్శనలు చేసి, వైసీపీ పాలకుల ఆగ్రహానికి గురయ్యారు.
గత ఎన్నికల ముందు పీఠాథిపతులను ఏకం చేసి, రోడ్డెక్కి ధర్మాగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాసానంద.. ఇప్పుడు.. గత వైసీపీ సర్కారులోనే స్వాములకు టీటీడీలో గౌరవం దక్కిందని కన్నెర్ర చేశారంటే, వెంకయ్య చౌదరి వ్యవహారశైలి పీఠాథిపతులకు ఏ స్థాయిలో ఆగ్రహం కలిగించి ఉందో స్పష్టమవుతోంది. ఎన్నికల ముందు కూటమికి ఆశీస్సులందించిన శ్రీనివాసానంద సరస్వతి వంటి ఆధ్మాత్మికవేత్తనే, టీటీడీ పాలనాతీరుపై విరుచుకుపడ్డారంటే.. ఇక సామాన్య భక్తుల సంగతి చెప్పాల్సిన పనిలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నిజానికి వెంకయ్య చౌదరి వ్యవహారశైలి, మాటతీరు ఏమాత్రం గౌరవప్రదంగా లేదని ఇప్పటికే చాలామంది బయట చర్చించుకుంటున్న పరిస్థితి. దానికి శ్రీనివాసానంద సరస్వతి తాజా ఆరోపణలు తోడవడంతో, వెంకయ్యపై వస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరినట్టయింది.
అయితే శ్రీనివాసానంద వ్యాఖ్యలపై టీటీడీ స్పందించి, ఆయన 50 మంది పీఠాథిపతులకు ఒకేసారి బ్రేక్ దర్శనం అడిగినందుకే, చౌదరిపై ఆరోపణలు చేస్తున్నారని ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమయింది. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకేరోజు డజన్లమందికి ఇచ్చిన సిఫార్సు లేఖ వ్యవహారం, మీడియాలో రచ్చయిన విషయాన్ని హిందూ సంఘాలు గుర్తు చేస్తున్నాయి.
‘‘ వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవంలో పీఠాథిపతులకు కొద్దిగా కూడా ఇవ్వరా? జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డి ఈఓ, ఏఈఓగా ఉన్నపుడు స్వాములకు దగ్గరుండి మరీ దర్శనం చేయించిన విషయం చౌదరికి తెలియదా? స్వాముల సలహాలు తీసుకోవాల్సిన ఏఈఓ మళ్లీ వారికి వ్యతిరేకంగా ప్రకటనలివ్వడమంటే, పీఠాథిపతులతో వైరం కొనితెచ్చుకోవడమే. కూటమికి మంచి పేరు తెస్తారని వెంకయ్యను నియమించిన ప్రభుత్వ నిర్ణయం తప్పని తేలింది. స్వాములు, పీఠాథిపతులు, మఠాథిపతుల పట్ల ఐఏఎస్ గిరీ చూపిస్తే, దాని పర్యవసానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతాయన్న విషయాన్ని చౌదరి గుర్తించకపోవడమే విచారకరం. అయినా కూటమి కోసం జగన్ ప్రభుత్వంపై శ్రీనివాసానంద సరస్వతి పోరాడినప్పుడు వెంకయ్య చౌదరి ఈ రాష్ట్రంలోనే లేరు. ఈ రాష్ట్రంలో లేనివారికి, జగన్ బాధితులు కాని వారికి కీలకపదవులిస్తే పరిస్థితి ఇంతకు భిన్నంగా ఎలా ఉంటుంద’ని టీడీపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
ఇక తిరుమలలో ఏం జరిగిందో చూద్దాం..
టీటీడీ అధికారులపై శ్రీనివాసానంద సరస్వతి స్వామి చేసిన ఆరోపణలు సరికావని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తమకు స్వామివారి దర్శన టిక్కెట్లను ఇవ్వకుండా అవమానించారని, శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై టీటీడీ వివరణ ఇస్తూ.. ‘నిజానికి స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనాలు, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారు. సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఇంతమందికి దర్శనం కల్పించడం సాధ్యం కాదని ఆ సంఖ్యను తగ్గించాలని ఆయన భావన. స్వామీజీ అడిగిన వారందరికీ శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదనే కోపంతో అధికారులపై ఆయన ఆరోపణలు చేశారు’ అని టీటీడీ తెలిపింది.
శ్రీనివాసానంద సరస్వతి ఏమన్నారంటే.. తిరుపతిలోని అర్బన్ హార్ట్‌లో జాతీయ సాధు సమ్మేళనం సదస్సుకు హాజరైన 300 మంది స్వామీజీలకు టీటీడీ ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు దర్శనం కనిపిస్తానని మాట ఇచ్చారని శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు.
అయితే తీరా దర్శనానికి వెళ్లినప్పుడు ఇచ్చిన మాట తప్పి, స్వామీజీలను అవమానించారని, వైసీపీ హయాంలోనే స్వామీజీలకు గౌరవం ఇచ్చి వీఐపీలకు మించి స్వామి వారి దర్శనం చేయించేవారని గుర్తు చేశారు.
అదనపు ఈవో వెంకయ్య చౌదరి లాంటి అవగాహన లేనివారి వల్ల ధర్మం గాడి తప్పుతోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిని టీటీడీ ఏఈఓగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి వెంకయ్య చౌదరి వల్ల నిరాశే మిగులుతోందని ఆరోపించడం సంచలనం సృష్టించింది. దానిపై టీటీడీ వివరణ ఇచ్చింది.