ఫ్లోరిడా రాష్ట్రంలో టాగో ఉగాది వేడుకలు

– తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలు

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది “జయంత విజయం” పద్యనాటకం.

ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసిన ఈ నాటకం నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపుదిద్దబడింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని ప్రదర్శితమైన ఈ రంగస్థల దృశ్యకావ్యం, భారతీయ పురాణాలు మరియు ఇతిహాసాల ధార్మికత్వాన్ని చాటి చెప్పేలా ప్రేక్షకులను అలరించింది.

తటవర్తి గురుకులం వారి పద్యకల్పద్రుమంలో భాగంగా, తటవర్తి కళ్యాణ చక్రవర్తి రచించిన ఈ నాటకం, తిక్కన గారి విరాటపర్వంలో పద్యాలను సులభమైన తెలుగు నేపథ్యంతో మేళవించి, సుమారు వేయి మందికి పైగా హాజరైన ప్రేక్షకులను విస్మయులయ్యేలా చేసింది.

అత్యంత సందోహ సంతోష సంబరంగా వెలసిన “క్రోధి” నామ సంవత్సర ఉగాది వేడుకలలో, ఆనంద ఆర్భాటాల మధ్య ఈ ప్రదర్శన అభినందన హేల మ్రోగించింది.

ఓర్లాండో తెలుగు సంఘం వారి సమన్వయంతో, చెరుకూరి మధుగారి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ నాటకంలో వెంకట శ్రీనివాస్ పులి, దీకొండ జయశ్రీ, నిడమర్తి కృష్ణ, యఱ్ఱాప్రగడ సాయి ప్రభాకర్, కసిరెడ్డి ఇంద్రసేన, శీలం గోపాల్, నిడమర్తి అరుణ, ఏనపల్లి మహేందర్, దివాకర్ల పవన్ కుమార్ మరియు దివాకర్ల ప్రసూన ముఖ్య పాత్రధారులు కాగా, శ్రీధర్ ఆత్రేయ అందించిన నేపధ్య సంగీతం మరియు RJ మామ మహేష్ కర్టెన్ రైజర్ వాయిస్ ఓవర్ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచాయి.