స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర భద్రతా చర్యలు చేపట్టండి

ఎన్నికల కమిషన్‌, డీజీపీకి దేవినేని ఉమ లేఖ

మంగళగిరి, మహానాడు: స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా రిటర్నింగ్‌ అధికారులకు దిశానిర్ధేశం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా, డీజీపీలకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. ఎన్నికల కమిషన్‌ సూచించిన నియమాలను ఉల్లంఘించిన కారణంగా స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతకు సంబంధించి తమ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల సమీపంలో సుమారు వంద మందికి పైగా టీడీపీ అభ్యర్థిపై ఇటీవల మూకు మ్మడి దాడికి పాల్పడ్డారు. నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ పక్కనే ఉన్న సెమినార్‌ హాలులో 450 మంది పోలీసు సిబ్బందితో కలిసి సిద్ధం పోస్టర్‌తో సీఎం సెక్యూరిటీ అట్టాడ బాబ్జీ నేతృత్వంలో సమావేశం నిర్వహిం చారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ల వివరాలపై వైసీపీ నేతలకు నేతలకు మాత్రమే సమాచారం అందించి పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి బ్యాలెట్‌ ఓట్లను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు.

వైసీపీ అరాచకాలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పోలింగ్‌ రోజు, మరుసటి నాడు జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని ఆయా నియోజకవర్గాల్లో కౌంటింగ్‌ రోజున ప్రజలు, కార్యక ర్తల ఆస్తులను కాపాడేందుకు హింసను అదుపులో పెట్టాలని విన్నవించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు డీఈఓ/ఆర్వోలను ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు ఏపీ ఎలక్షన్‌ ఇన్‌చార్జ్‌ అవినాష్‌, ఎన్నికల పరిశీలకులు, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు/ రిటర్నింగ్‌ అధికారులతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాశారు.