‘వేదాద్రి -కంచల’ కు మరమ్మతులు చేపట్టి అన్నదాతను ఆదుకోండి

– ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

నందిగామ, మహానాడు: వేదాద్రి -కంచల ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి వసతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతు సంఘం, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో వేదాద్రి- కంచల ఎత్తిపోతల పథకాన్ని రైతులు, రైతు సంఘాల నేతలు పరిశీలించారు. అనంతరం నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డిఓ కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమూలు సైదులు మాట్లాడుతూ 2004లో ప్రారంభమైన వేదాద్రి -కంచల ఎత్తిపోతల పథకం రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పంపింగ్ స్కీమ్ అని అన్నారు. దీని కింద నాలుగు మండలాలు పరిధిలో 17, 866 ఎకరాల సాగు భూమి విస్తీర్ణంలో ఉన్నదన్నారు. 2018 నుండి మోటర్లు పాడైపోయి పనిచేయడం లేదని, సాగునీటి వసతి లేక రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పటి ప్రభుత్వం మరమ్మతుల కొరకు ఏడు కోట్లు అంచనా వేసిందని, గత ప్రభుత్వం అయిదేళ్ళలో సాగునీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాల ఆందోళన ఫలితంగా ఎనిమిది కోట్ల 60 లక్షల మరమ్మతులు అంచనా వేశారని, అయినను పనులు ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.గోపాల్, వేల్పుల ఏసోబు, కర్రీ వెంకటేశ్వరరావు, బి లాజరు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సయ్యద్ ఖాసిం, రైతు సంఘం నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, గుదే నర్సింహారావు, నల్లాని శ్రీనివాసరావు యస్ఎఫ్ఐ నాయకులు గోపి నాయక్, జె దామోదర్ తదితరులు పాల్గొన్నారు.