తమ్ముళ్లు బజ్జున్నారా?

  • భారీ విజయం తో టీడీపీ సుషుప్తావ స్థితి లోకి వెళ్ళిపోయిందా!
  • చంద్రబాబు, లోకేష్ కూడా పార్టీని వదిలేసి ప్రభుత్వం లో మునిగిపోయారా?
  • పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం కరువైందా?
  • జగనిష్టుల అసత్యాల ఫ్యాక్టరీల నుంచి వెలువడే రాజకీయ కాలుష్యానికి విరుగుడు ఏంటి?
  • టీడీపీయులు ఇప్పుడు చేయాల్సింది ఏమిటీ?
  • చేయాల్సింది చేయకపోతే… ఏం జరుగుతుంది?

టీడీపీ యంత్రాంగం నిస్తేజం అయిపోయిందా !? మొన్నటి ఎన్నికల నాటికి, గత ఐదేళ్లు గా తిండీ తిప్పలు లేక, ఆకలితో… ఆకులూ, అలములూ తింటూ అలమటించినట్టు కనిపించిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు విశ్రాంతి పర్వం లోకి జారుకున్నారా? తెలుగుదేశం కూటమి కి ప్రజలు 164 /175 సీట్లు కట్టబెట్టడమే ఇందుకు కారణమా?. రాజకీయం గా ఇక తాము చేయవలసిన పనులు ఏమీ లేవన్న నిర్లిప్తతకు లోనయ్యారా? ఒక్క తెలుగు దేశం పార్టీకే 134 సీట్లు ఇవ్వడమే ఓటర్లు చేసిన తప్పా?

భవిష్యత్ లో…. ఒక వేళ…… ఐతే గియితే….ఖర్మ కాలి…. పవన్ కళ్యాణ్ కి సడెన్ గా ఏ తిక్కో రేగితే …. బీజేపీ కి చురుక్కుమంటూ చేప ముల్లు ఎక్కడో గుచ్చుకుంటే …. ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితులు ఏర్పడక తప్పని పరిస్థితులు ఒక వేళ గనుక…. ఏర్పడితే ;, తెలుగు దేశం ప్రభుత్వానికి ఏమీ ఇబ్బంది లేదులే అన్న భరోసా తో తెలుగుదేశం యంత్రాంగం నిద్రాణ స్థితి లోకి జారుకున్నదా?

సరే. ఇంతవరకు బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు…. ప్రజల అభీష్టం మేరకు… నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ నాయకుడిగానే ఇంతకాలం జనానికి తెలిసిన చంద్రబాబు నాయుడు ; ఇప్పుడు రాజనీతిజ్ణుడు(“స్టేట్స్ మ్యాన్ “) గా తన ఇమేజ్ మార్చుకోవాలని భావిస్తున్నారా అన్నట్టుగా ఆయన ప్రసంగాలు, నిర్ణయాలు, వ్యవహార శైలి ఉంటున్నాయి. నడక బాగా నిదానం గా ఉన్నదనే సనుగుళ్ళు అక్కడక్కడా వినిపిస్తున్నప్పటికీ ; చంద్రబాబు థియరీ…. చంద్రబాబుదే కదా!

నిజానికి, “తెలుగు దేశం” అంటే చంద్రబాబు కాదు. “తెలుగు దేశం ” అంటే రాష్ట్రవ్యాప్తం గా గ్రామ గ్రామాన ఉన్న కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు,దేశ విదేశాల్లోని అభిమానులు. వారంతా యాక్టివ్ గా ఉంటూ క్రియాశీలకం గా వ్యవహరించబట్టే ; తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. అధికారం లోకి వచ్చాము కదా అనుకుంటూ టీడీపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ఇప్పుడు ఇనాక్టివ్ అయ్యి,సుషుప్తావస్థ లోకి జారుకున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది.

లేకపోతే, 11 సీట్లే కనాకష్టం గా వచ్చిన పార్టీ కి నాయకుడైన వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన…. రేయింబవళ్ళు చంద్రబాబు పైన, ఆయన నేతృత్వం వహించే ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తుంటే, రాజకీయ బురదను పిచికారీలతో స్ప్రే చేస్తుంటే; రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, పార్టీ కార్యాలయాలు, క్రియాశీలక కార్యకర్తలు, వారిని వెనక ఉండి నడిపించే శ్రేయోభిలాషులు, మేధోసంపన్నులు ఏంచేస్తున్నట్టు అనే విషయం అర్ధం కావడం లేదు.

ఒకే అబద్దాన్ని రోజులు 10 సార్లు వంతున నెలకు 300 సార్లు, ఏడాదికి 3600 సార్లు, అయిదేళ్లకు కలిపి 18000 సార్లు అదే పనిగా చెబుతుంటే, ప్రజలు నమ్ముతారనే థియరీ లో ప్రగాఢ విశ్వాసం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ; ఆయన పాలు పోసి పెంచుతున్న సాక్షి, దాని అనుబంధ మీడియా. అందుకే 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్యను చంద్రబాబు నాయుడు కు ఆపాదిస్తూ చేసిన ప్రచారమే ఉదాహరణ కదా!

అందువల్ల, ఆయన నోరు తెరిస్తే…. అందులోంచి ఆయనకు తెలియకుండానే అబద్దాలు అలవోకగా దొర్లుతాయి. అదేదో ఆయన సరదాగా చెప్పడం లేదు. అది జగన్ ఫిలాసఫీ. ఆ నోరు ఓ అసత్యాల ఉత్పత్తి కేంద్రం. ఆ విషయం ఆయనకు తెలిసి ఉండక పోయినా ఆశ్చర్యం లేదు కూడా. అందువల్ల సాక్షి, దాని అనుబంధ మీడియా ఫిలాసఫీ మరో రకం గా ఎందుకు ఉంటుంది? డ్రిప్ ఇరిగేషన్ లో పైపుల నుంచి నీరు స్ప్రే చేసినట్టు – ఈ అసత్యాల బురదను నిరాఘాటంగా సమాజం పై స్ప్రే చేయడానికి అవసరమైన వనరులు జగన్ బృందం వద్ద… గడ్డి వాముల రేంజ్ లో మేట వేసి ఉన్నాయి. మరి ఈ బురద సమాజానికి అంటకుండా తెలుగుదేశం శ్రేణులు క్రియాశీలకం కావలసిన అవసరం లేదా అనే సంశయం ‘దేశం’ అభిమాన వర్గాలలో వ్యక్తమవుతోంది.

తెలుగు దేశం పార్టీకి రాష్ట్రం లోని 175 నియోజక వర్గాలలోను కార్యకర్తలు ఉన్నారు. స్థానికం గా జనసేన, బీజేపీ కి నియోజక వర్గ స్థాయిలో యంత్రాంగం లేదేమో గానీ, టీడీపీ కి ఎక్కడికక్కడ పార్టీ యంత్రాంగం ఉంది. అయితే స్థబ్దుగా ఉన్నట్టు ఉన్నది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ ని “మంగళగిరి ఆఫీస్ ” వెంటనే క్రియాశీలకం చేయకపోతే, పార్టీ యంత్రాంగం మెల్ల మెల్ల గా అచేతనమై, వచ్చే ఎన్నికల నాటికి – ప్రాక్టీస్ చేయకుండా ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారుడులా తయారవుతుంది. ఈ ప్రమాదాన్ని రాష్ట్ర టీడీపీ నాయకత్వం పరిగణన లోకి తీసుకోవాలి.

జగన్ పరివారం… కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచే ” జగన్ప్ర చారం (గోబెల్స్ ప్రచారం అనే పదానికి పర్యాయ పదం – జగన్ప్ర చారం ) ప్రారంభించారు. ఏరోజుకారోజు, ఈ జగన్ప్రచారం పై 175 నియోజక వర్గాలలోని టీడీపీ బాధ్యులు , ఆ అసత్యాలను స్థానిక ప్రజల దృష్టికి తీసుకు రావలసిన అవసరం ఉంది. అవసరమే కాదు – అగత్యం కూడా ఏర్పడింది . ఇది 365 రోజులు × 5 సంవత్సరాలు చేయవలసిన కార్యక్రమం. స్థానిక మీడియాలో… జగనిజంతో కలుషితం కాని మీడియా ఇంకా ఉంది. ఏరోజుకారోజు సాక్షి మీడియా ప్రచారాన్ని సోదాహరణం గా ఖండిస్తూ…, ఆ అసత్యాలు, ఆ ఆరోపణలు, ఆ ఎదురుదాడులు, ఆ పత్తిత్తు కబుర్లను ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళాలి. దీనికి ఇదే ఓ పెద్ద బృహత్కార్యక్రమం.

175 నియోజక వర్గ కేంద్రాల నుంచి…. ప్రజలకు ఏరోజుకు ఆరోజు ఏమిచెప్పాలో…టీడీపీ కేంద్ర కార్యాలయం 175 నియోజక వర్గాల బాధ్యులకు దిశా నిర్దేశం చేయాలి.. ఉదాహరణకు – తనకు పేరు వస్తుందనే “దిశ” చట్టం ప్రభుత్వం అమలు చేయడం లేదని జగన్ ఆరోపించారు. టీడీపీ సైన్యం తక్షణమే స్పందించాలి. ” దిశ ” చట్టం ఎక్కడ ఉంది బాబూ…? ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది నాయనా ? జగనిష్టులు చెప్పాలని 175 నియోజక వర్గాలలోని టీడీపీ నేతలు స్పందించాలి. అసలు ” దిశ” చట్టం అంటూ ఏమీ లేదు. కేంద్రం ఈ డ్రాఫ్ట్ ను ఆమోదించలేదు. ఈ విషయం ప్రజలకు తెలియాలి.

ఈ తరహా అసత్యాలకు, ఆరోపణలకు వైసీపీ డెన్ లో కొరత ఏమీ ఉండదు కనుక, రాష్ట్ర వ్యాప్తం గా టీడీపీ కూడా పూర్తి సన్నద్ధత తో తిప్పికొడుతూ, టీడీపీ ” పాయింట్ అఫ్ వ్యూ ” ను అలసత్వం లేకుండా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇందుకోసం, రాష్ట్రస్థాయి నుంచి నియోజక వర్గం స్థాయి వరకు…. ఒక విభాగం సైతం ఏర్పాటు కావలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రభుత్వ నిర్వహణ లో మునిగిపోయారు. తెలుగు దేశం పైన…., చంద్రబాబు పైన ఏ రోజు వచ్చే అబద్దాలను ఆరోజే కౌంటర్ చేయడం ఎంత ఆవశ్యకమో ఒక ఉదాహరణతో చెప్పవచ్చు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఈ 50 రోజులలో 35 హత్యలు జరిగాయని జగన్…; అటు ఢిల్లీ లోనూ, ఇటు తాడేపల్లి లోనూ ఆరోపించారు. హోమ్ మంత్రి అనిత స్పందిస్తూ, హత్య కు గురైన 35 మంది పేర్లు, పోలీస్ కంప్లైంట్స్, ఎఫ్ ఐ ఆర్ వివరాలు ఇవ్వమని అడిగారు. జగన్ డెన్ నుంచి సౌండ్ లేదు. ఆ డెన్ మౌనాన్ని టీడీపీ స్థానిక నేతలు ప్రతి నియోజక వర్గం లోనూ ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఈ రకం గా టీడీపీ… నియోజకవర్గ స్థాయిలో ఆ అసత్యాలు, ఆరోపణల వెంటబడితే, ఆ నోళ్లకు తాళాలు పడతాయి. ప్రజలలో చైతన్యం పెరుగుతుంది.

దీనికి తోడు ఆ డెన్ లో ముందు ముందు చాలామంది భక్తిపరులు గా మారి …. శ్రీకృష్ణ జన్మస్థానానికి క్యూ కట్టే అవకాశం ఉంది. చంద్రగిరి లో భీతావహం సృష్టించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి ని పోలీసులు బెంగళూరు లో పట్టుకుని “అక్కడికి ” తీసుకు వచ్చారు.. ఈ విషయాన్ని; ముందుముందు చోటు చేసుకోబోయే “ఇలాటి” అనేక ఘటనలను ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో… ప్రజల దృష్టికి తీసుకు రావాలి. ఎందుకు తీసుకు రావలసి వచ్చిందో… వివరించి చెప్పాలి. ఇవేమీ చేయకుండా…. “మన ప్రభుత్వం వచ్చింది లే….” అని బబ్బుంటే…. బబ్బున్నట్టే ఉంటుంది.

– భోగాది వేంకట రాయుడు