– ఆర్థిక నిపుణుడు చెరుకూరి కుటుంబరావు
గుంటూరు, మహానాడు: ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలలో వైవిధ్యం గల వస్తు ఉత్పత్తి చేస్తూ 420 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో ప్రపంచ గుర్తింపు పొందిన వ్యాపార దిగ్గజంగా టాటా గ్రూప్ రూపొందటం అభినందనీయమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ప్రణాళిక సంఘ పూర్వ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు పేర్కొన్నారు. స్థానిక జనచైతన్య వేదిక హాలులో ఆదివారం భారత్ ప్రగతిలో టాటాల పాత్ర అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి ముఖ్యఅతిథిగా హాజరై కుటుంబరావు ప్రసంగించారు. భారతదేశంలో 1868లో ప్రారంభించిన టాటా గ్రూప్ దేశానికి ఆర్థిక పునాదులు వేసిందని, సంక్షేమం, ధాతృత్వాన్ని చాటి చెప్పారన్నారు.
సంపదను సృష్టిస్తూ వాటి ఫలితాలను సామాన్యులకు అందించే ధ్యేయంగా టాటా సంస్థలు పని చేస్తున్నాయన్నారు. 1912 లోనే ఎనిమిది గంటల పని విధానాన్ని, 1915లో ఉచిత వైద్య సహాయాన్ని, 1917లో కార్మిక సంక్షేమ విభాగాన్ని, కార్మికుల పిల్లలకు విద్యను అందించడం, 1920లో జీతంతో కూడిన సెలవులు ఇవ్వడం, 1920 లోనే కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయడం, 1921లో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు, 1928లో ప్రసూతి సెలవులు ఇవ్వడం, 1934లో కార్మికులకు బోనస్, గ్రాట్యుటీ లాంటి సంక్షేమ కార్యక్రమాలను భారత దేశంలో మొదటిగా ప్రవేశపెట్టిన ఘనత టాటా గ్రూపులదే అన్నారు.
ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.ఏ. ఆర్. సుబ్రహ్మణ్యం, మానవత చైర్మన్ పావులూరి రమేష్, నేస్తం సహ వ్యవస్థాపకుడు టి. ధనుంజయ రెడ్డి తదితరులు ప్రసంగించారు. సభ ప్రారంభంలో రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.