టీడీపీ అభ్యర్థులు కౌంటింగ్ కు ముందే నియోజకవర్గాలకు చేరుకోవాలి

పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

హైదరాబాద్: పోలింగ్ ట్రెండ్, జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఫలితాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని, కౌంటింగ్ కు ముందే టీడీపీ అభ్యర్థులందరూ తమ నియోజకవర్గాలకు చేరుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమస్యాత్మక నియోజకవర్గాల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

అంతకుముందు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి విజయంలో సందేహాలు అవసరం లేదని, అలాగని శ్రేణులు ఉదాసీనంగా ఉండరాదని అన్నారు. కౌంటింగ్ సమయంలో టెన్షన్ పడొద్దని, ఎవరూ తొందరపాటు చర్యలకు దిగొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ నేతలు హైదరాబాదులో తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. చినరాజప్ప, అఖిలప్రియ, ప్రభాకర్ చౌదరి, నాగుల్ మీరా, రామాంజనేయులు తదితరులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో పలు అంశాలపై చర్చించారు.