గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తెదేపా లక్ష్యం

-గంజాయి హబ్ గా మార్చిన ఘనత వైసీపీది 
-పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్

నరసరావుపేట, మహానాడు:  ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా మార్చిన ఘనత వైసీపీ సర్కారుదని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు కూడా వైసీపీ ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే గంజాయి అక్రమ రవాణా సాగుతుందని కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు

సోమవారం పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…  2014 నుంచి 2019 వరకు గంజాయి లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధన దాహంతో విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి అక్రమంగా డబ్బు సంపాదించుకోవాలని ఆశతో ప్రశాంతమైన పల్లెల్లోకి సైతం గంజాయిని తీసుకొచ్చిన ఘనత వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకే చెల్లుతుందన్నారు.

ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో మైనర్ బాలుర నుంచి స్కూల్లు ,కాలేజీలు టార్గెట్ గా పెట్టుకొని వారికి మత్తు అలవాటు చేసి గంజాయి, మాదక ద్రవ్యాలను అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేసిన చరిత్ర వైసీపీ పార్టీదన్నారు

గత ఐదేళ్ల అరాచకాల నుంచి ఇప్పుడే కోలుకుంటున్న రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర హోంశాఖ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. రానున్న రోజుల్లో గంజాయిలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. వత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గంజాయిని తరిమికొట్టే విధంగా ప్రతి ఒక్క అధికారి వ్యవహరించాలని దానికి కూటమి ప్రభుత్వ శ్రేణులు సహకరించాలని ఆయన సూచించారు.

రాష్ట్రం వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, యువతి యువకుల తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా గంజాయి మత్తులోనే జరుగుతున్నాయని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను సక్రమ మార్గంలో నడిచే విధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.  అదేవిధంగా ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలన లక్ష్యంగా పని చేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో ఆయనతోపాటు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పీఎస్ కే మస్తాన్ షరీఫ్, బెల్లంకొండ సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతిసముద్రం, నరసరావుపేట పార్లమెంటు కమిటీ కార్యదర్శి తమ్మిశెట్టి సత్యాన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.