టీడీపీది అభివృద్ధి బాట… వైసీపీది జైళ్ళ బాట!

– పార్టీ కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండించిన గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వంద రోజులు పాలనలో ప్రజల కోసం, ప్రజాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ప్యాలెస్ లో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయిన కొద్దిరోజుల్లోనే తట్టుకోలేక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయం పై దాడి చేసిన ఆనాటి ఎంపీ నందిగామ సురేష్, మాచర్లలో అల్లర్లు సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సబ్ జైల్లో ఉంటే పరామర్శించేందుకు ప్రజల మధ్యకు వచ్చారు. ఆయన బాటలో దర్శి వైసీపీ నాయకులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా దేకనకొండలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యకర్తలపై దాడులు చేసిన వారు సబ్ జైల్లో ఉంటే పరామర్శలకు వచ్చారని టీడీపీ దర్శి ఇన్‌ఛార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు.

ఈ మేరకు ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. దర్శి ప్రాంతంలో ఇలాంటి దాడులు ఎప్పుడు లేవని అన్నారు. అయ్యా శివప్రసాద్ రెడ్డి ఎన్నికల్లో మీరు చేసిన దౌర్జన్యాలు, దాడులు ప్రజలందరికీ తెలుసు.. మేము స్వల్ప తేడాతో ఎందుకు ఓడిపోవలసి వచ్చిందో ప్రజలకు అర్థం చేసుకున్నారు. ప్రజా విశ్వాసం లేని మీరు ప్రజలను రెచ్చగొట్టి ఇంకా రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని ఆమె హితవు పలికారు. ఇప్పటికైనా దర్శి నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణ నెలకొనే లాగా వైసీపీ శ్రేణులను సమన్వయపర్చుకోవాలని బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సూచించారు. పార్టీ కార్యకర్తలపై దాడులను లక్ష్మి తీవ్రంగా ఖండించారు. దాడులకు తెగబడుతున్న వైసీపీ మూకలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.