డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ హబ్‌గా తెలంగాణ

-గ్లోబల్‌ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం
-పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
-పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి

హైదరాబాద్‌: ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే తెలంగాణను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం బేగంపేటలోని హోటల్‌ హరిత ప్లాజాలో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 3వ సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం వివాహ వేడుకలకు గమ్యస్థానంగా ఉన్నప్పటికీ హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ఫంక్షన్‌ హాల్స్‌, కన్వెన్షన్‌ సెంటర్లు, రిసార్టుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌కు ఆవల ఎన్నో సుందరమైన ప్రదేశాలు, పుష్కలమైన వనరులు ఉన్నాయని తెలిపారు. చారిత్రక ప్రాముఖ్యత, పచ్చని కొండల నడుమ ఉన్న సాగర్‌ తీరం డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు అనువైన ప్రాంతమని, అదేవిధంగా కృష్ణా నదీ తీరాన కొల్లాపూర్‌లోని సోమశిల బ్యాక్‌ వాటర్‌ కూడా అద్భుతమైన కేంద్రమని, ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

గ్లోబల్‌ టూరిజం లక్ష్యంగా అడుగులు
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను గ్లోబల్‌ టూరి జం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మెడికల్‌ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్‌ టూరిజం, స్పిరిచ్యువల్‌ టూరిజం (ఎంఐసీఈ) సహా వివిధ టూరిజం రంగాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యాల (పీపీపీ) ద్వారా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పర్యాటక శాఖ అభివృద్ధితో ఆదాయం పెరగడంతో పాటు యువతకు గణనీయ మైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ రమేష్‌నాయుడు, పర్యాటక శాఖ డైరెక్టర్‌ కె.నిఖిల, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా, హైటెక్స్‌ హెడ్‌ శ్రీకాంత్‌, ఎస్‌ఐడబ్ల్యూపీసీ కన్వీనర్‌ శ్రవణ్‌ మాదిరాజు, టీసీఈఐ కన్వీనర్‌ రామ్‌ కె ముప్పన, టీసీఈఐ ఈవెంట్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ కో-కన్వీనర్లు హరీష్‌రెడ్డి, కుమార్‌ రాజా, డాక్టర్‌ సౌరభ్‌ సురేఖ, సుధాకర్‌ యరబడి, తదితరులు పాల్గొన్నారు.