జైపాల్‌రెడ్డితోనే తెలంగాణ వచ్చింది

జైపాల్ రెడ్డి సూచన మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు
ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేశాం
ఆగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కండి
– కల్వకుర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కల్వకుర్తి: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు నేను నల్లమల బిడ్డనే. మీ సోదరుడినే. జైపాల్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా… చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారు.నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఆయన రాజకీయాలు చేశారు.పదవులకే గౌరవం తెచ్చేలా జైపాల్ రెడ్డి వ్యవహరించారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి.

ఆనాడు రాష్ట్రానికిముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది. జైపాల్ రెడ్డి సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు. కల్వకుర్తి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారు.

కాంగ్రెస్ మాట ఇస్తే చేసి తీరుతుంది.కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నాం. మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుపరిచేందుకు రూ.10కోట్లు.నియోజకవర్గంలో అన్ని అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు.కల్వకుర్తి- హైదరాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్లు అభివృద్ధి చేస్తాం. నేను చదువుకున్న కాండ్ర పాఠశాల రూ.5కోట్లతో అభివృద్ధి చేస్తాం.ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం.50ఎకరాల్లో రూ.100 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం.

ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని సవాల్ చేసాం.ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేశాం. జూలై 31 లోగా లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతాం. ఆగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం. బీఆరెస్ నేతల్లో అధికారం కోల్పోయిన బాధ స్పష్టంగా కనిపిస్తోంది..

ప్రతిపక్షం తన బాధ్యత సరిగ్గా నిర్వహించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా గెలిచేవారు. కానీ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు వారికి అవకాశం ఇవ్వరు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కండి. కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత నాయకులుగా మేం తీసుకుంటాం.

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ. 309 కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటి అండ్ చైల్డ్ ఆసుపత్రికి రూ.22 కోట్లు.
ఆమనగల్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు రూ.10కోట్లు.
రూ.163 కోట్ల వ్యయంతో నాలుగు R&B రహదారుల నిర్మాణం.
కల్వకుర్తి పట్టణంలో R&B అతిధి గృహం నిర్మాణానికి రూ.5 కోట్లు.
పంచాయతీ రోడ్లకు రూ.78 కోట్లు
ఐదు హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 15 కోట్లు.
మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3 కోట్లు
మాడ్గుల మండల కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్లు