–ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు నిందితులను స్వేచ్ఛగా బయట తిరగనివ్వవద్దు
-సాక్షులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి
-గుంటూరు ఆసుపత్రిలో 20 21 లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా వ్యవహరించిన వైద్యులను నిందితులు ఒత్తిడి చేయకుండా పోలీసులు నిఘా పెట్టాలి
-మిలటరీ ఆసుపత్రి వైద్య నివేదిక ప్రస్తుత హైకోర్టు జడ్జి సమక్షంలోనే సిద్ధం చేశారు
-మిలిటరీ ఆసుపత్రి వైద్య నివేదికలో దారుణంగా హింసించడం వల్లే నా కాలి వేలు విరిగిందని, రక్తస్రావం జరిగిందని స్పష్టంగా వెల్లడి
-మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించే శుంఠలకు, ఐదున్నర సంవత్సరాల తర్వాత మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారో చెప్పాలి
-ఆధారాలు దొరికితే ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు
-కొట్టిన వారిని గుర్తుపట్టలేదని చెప్పిన మాట నిజమే… కానీ కొట్టడానికి కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి, సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్ అని స్పష్టంగా చెప్పాను
-తనపై నమోదైన కేసును పక్కదారి పట్టించేందుకు కులాల సమస్యగా మార్చాలని చూస్తున్న సునీల్ కుమార్ నైజమేమిటో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఎండగడుతున్నారు
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
అమరావతి: గత మూడేళ్ల క్రితం తప్పుడు కేసులో నన్ను అరెస్టు చేసి అకారణంగా చిత్రహింసలకు గురిచేసి, హత్య చేయాలని చూసినా కేసులోని నిందితులను తక్షణమే అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు కోరారు. ఈ కేసులో తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలన్నింటినీ కేసు విచారిస్తున్న విచారణ అధికారిని కలిసి అందజేస్తానని తెలిపారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు, A1, A2, A3 నిందితులుగా ఉన్న వారిని బయట స్వేచ్ఛగా తిరగనివ్వొద్దని, వారు సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
సాక్షులకు, నిందితుల చేత హాని కలిగే అవకాశం ఉన్నందని వారికి రక్షణ కల్పించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. సాక్షి దినపత్రికలో రాసిన తప్పుడు కథనంపై ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. సాక్షి దినపత్రికలో ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించి, వార్తా కథనాన్ని రాశారు. అయినా ఇప్పుడు సాక్షి దినపత్రిక చదివే వారు ఎవరూ లేరు. ఇప్పటికీ సాక్షి వార్తా కథనాలను చదివే దురభిమానులెవరైనా ఉంటే వారికి నా బాధ్యతగా వాస్తవాలను చెప్పాలి కాబట్టి చెబుతున్నానని వెల్లడించారు.
శనివారం ఉదయం రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ .. ఒక ఎంపీ ని అపహరించి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి చంపాలని చూసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మళ్లీ ఎవరు ఇటువంటి తప్పులు చేయాలని ఆలోచన రాకుండా నిందితులను శిక్షించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. 20 21 లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా వ్యవహరించిన వైద్యులపై నిందితులు ఒత్తిడి చేయకుండా పోలీసులు నిఘా పెట్టాలన్నారు.
సాక్షులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు కోరారు. మిలిటరీ ఆసుపత్రి వైద్య నివేదికను ప్రస్తుత హైకోర్టు జడ్జి సమక్షంలోనే సిద్ధం చేయడం జరిగిందని, అలాగే తనని కోర్టులో హాజరుపరిచినప్పుడు మెజిస్ట్రేట్ కూడా నా కాళ్ళపై ఉన్న దెబ్బలను చూశారని పేర్కొన్నారు. అవసరమైతే ఈ కేసులో మెజిస్ట్రేట్ ను కూడా సాక్షిగా పిలువనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అతిగా ఆవేశపడి అడ్డగోలుగా మాట్లాడి దొరికేస్తున్నారని, అతిగా మాట్లాడితే అడ్డంగా దొరికిపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటువంటి అన్యాయం మరెవరికి జరగకుండా చూడాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.
కులాల మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు సునీల్ కుమార్ ప్రయత్నం
తనపై నమోదైన కేసు నుంచి ప్రజల దృష్టిని మలిచి, దీన్ని కులాల మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ప్రయత్నిస్తున్నారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా అక్కడ తాను ఉంటానని సునీల్ కుమార్ చేసిన ట్విట్ పరిశీలిస్తే, మీకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారా?, మీ కోసం మీరే నిలబడ్డారా? అంటూ ప్రశ్నించిన ఆయన, తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఒక వర్గాన్ని రెచ్చగొట్టి అడ్డం పెట్టుకోవాలని ప్రయత్నాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని గుర్తు చేశారు.
పీవీ సునీల్ కుమార్ ఎంతటి కుసంస్కారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానన్న సునీల్ కుమార్, గతంలో డాక్టర్ సుధాకర్ ను కాళ్లు చేతులు కట్టేసి నడి రోడ్డుపై చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఆయన ఎక్కడా?, ఒక దళిత యువకుడి నోట్లో మూత్రం పోసి అవమానించినప్పుడు, మరొక దళిత యువకుడికి హెల్మెట్ లేదని చంపేసినప్పుడు పీవీ సునీల్ కుమార్ ఏమయ్యాడని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని టీవీ5 మార్నింగ్ డిబేట్లో జర్నలిస్టు మూర్తి ప్రస్తావించారని గుర్తు చేశారు.
జూన్ 10వ తేదీన నే ఫిర్యాదు చేశా
20 21 మే 14వ తేదీన నన్ను అపహరించి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి, అప్పటికే గుండె ఆపరేషన్ చేయించుకున్న నా చాతి పై కూర్చుని హత్యాయత్నం చేసిన సంఘటనపై గత నెల పదవ తేదీన గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే స్టెనో తప్పుగా 11 వ తేదీ అని రికార్డు చేశారన్నారు. పదవ తేదీన నే నేను ఫిర్యాదు కాపీని గుంటూరు ఎస్పీకి కూడా మెయిల్ చేయడం జరిగింది.
మీడియా ప్రతినిధులకు కూడా కాపీని పంపించడం జరిగింది. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ ని మీడియా ప్రతినిధుల మొబైల్ కు పంపిన తేదీని పరిశీలిస్తే, నేను ఏ తేదీన ఫిర్యాదు చేశానో స్పష్టం అవుతుంది. దానికి ఆధారాలుగా 11వ తేదీ ప్రముఖ దినపత్రికలలో వచ్చిన వార్త కథనాలను పరిశీలించవచ్చు.
ఉదయం ఐదు గంటలకే పాఠకుల చేతికే అందే ఈనాడు దినపత్రికలో ‘ జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి ‘ అన్న శీర్షికతో ప్రచురించిన వార్త కథనాన్ని మీడియా ప్రతినిధుల ముందు రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త కథనాన్ని కూడా ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు.
స్టెనో యాదృచ్ఛికంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి, 11వ తేదీ అని టైప్ చేసి ఉంటారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పదవ తేదీన నే నేను గుంటూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీని మీడియా ప్రతినిధులతో పాటు రాష్ట్ర డీజీపీ కి కూడా అందజేయడం జరిగిందన్నారు. అదే రోజు పోలీసులు న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకొని ఉంటారు.
అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు ఇస్తే, పదవ తేదీన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుధాకర్ రెడ్డి స్టేట్మెంట్ పరిశీలిస్తే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందన్న అభిప్రాయం కలిగే విధంగా పిచ్చిపిచ్చిగా మాట్లాడడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు . సుప్రీం కోర్టు వారించిన వినరా?, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం అనే శీర్షికతో సాక్షి దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించడం వారి అనైతికతను తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టుకు ఈ మ్యాటర్ తో సంబంధమే లేదు
సుప్రీం కోర్టుకు ఈ మ్యాటర్ తో సంబంధమే లేదని, అయినా సుప్రీం కోర్టు వారించిన వినరా? అని సాక్షి దినపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
2021 మే 14వ తేదీ అర్ధరాత్రి నన్ను దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన అనంతరం, హత్య చేయడానికి నా ఛాతిపై కూర్చున్నారు. అప్పటికి ఆరు నెలల ముందే నాకు గుండె సర్జరీ జరిగింది. నేను చనిపోతానని వారు అనుకున్నారు. కానీ నా అదృష్టం కొద్ది, వారి దురదృష్టం కొద్దీ అలా జరగలేదు. 15వ తేదీ ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేసిన అనంతరం 16వ తేదీ సాయంత్రం నన్ను జైల్లోకి తోశారు.
16వ తేదీ ఆదివారం అయినప్పటికీ సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ సమావేశమై నా బెయిల్ పిటీషన్ ను విచారించి, వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని మిలటరీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. అదేరోజు పరీక్షలు నిర్వహించి నివేదికను అందజేయాలని పేర్కొంది. 17వ తేదీ మిలిటరీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా, 18వ తేదీ మిలిటరీ ఆసుపత్రి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. 21వ తేదీన సుప్రీం కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది. ఆ కేసు కేవలం బెయిల్ మంజూరి కోసమేనని, నన్ను అకారణంగా చిత్రహింసలు గురి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై మా అబ్బాయి మరొక పిటిషన్ దాఖలు చేసి కేసు విచారణను సిబిఐ కి అప్పగించాలని కోరారు.
అసలు ఆ కేసు లిస్టు కాలేదు. రెండేళ్ల తర్వాత లిస్ట్ అయినప్పుడు హైకోర్టును ఆశ్రయించారా అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు రావడం కరెక్ట్ కాదు కదా అని పేర్కొనగా, సుప్రీం కోర్టు, హైకోర్టుకు వెళ్ళమని సూచిస్తే వెళ్లడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొనడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు లో కేసు ఉపసంహరించుకొని హైకోర్టుకు వెళ్లడం జరిగింది. దీనితో ఆ కేసు సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
ఇప్పటికీ ఆ కేసు హైకోర్టులో పెండింగులో ఉంది. హైకోర్టులో ఒకసారి హియరింగ్ కు వచ్చినప్పుడు వైద్య నివేదికలను కాల్చివేయాలని చూస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా, వైద్య నివేదికలను భద్రపరచాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అలాగే సిఐడి పోలీసు అధికారుల సెల్ ఫోన్ వివరాలను, సిఐడి కార్యాలయ సిబ్బంది సెల్ ఫోన్ వివరాలను, తాడేపల్లి ప్యాలెస్ లొకేషన్ లోని నెట్వర్క్ వివరాలను భద్రపరచాలని టెలికాం శాఖకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఆ తర్వాత ఆ కేసు ఇప్పటివరకు హియరింగ్ రాలేదు. సెల్ ఫోన్ లో డాటా ప్రిజర్వ్ చేసి అందజేయాలని మాత్రం కోర్టు మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు.
ప్రజా కంటక పాలన పోయి… ప్రజా పాలన వచ్చిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశా
రాష్ట్రంలో ప్రజా కంటక పాలన పోయి, ప్రజా పాలన వచ్చిన నేపథ్యంలో మూడేళ్ల క్రితం తనను దారుణంగా హింసించి, హత్యాయత్నం చేసిన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 10వ తేదీన గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
వై నాట్ 175 అన్న వారిని 11 స్థానాలకే పరిమితం చేస్తూ, రాష్ట్ర ప్రజలు దుర్మార్గపు పాలనను అంతమొందించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో స్థానికంగానే పోలీసుల ప్రవర్తనలో మార్పు వచ్చి ఉంటుందని, గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా చెప్పిన వెధవ పనులన్నీ చేసే పనికిమాలిన వాళ్ళు పోలీసులు కాదు అనే ఉద్దేశంతో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు. గత నెల పదవ తేదీన ఫిర్యాదు చేయగా, ఈనెల 11వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆ వార్త ప్రజా బాహుల్యంలోకి వచ్చిందన్నారు.
మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు ఇప్పుడు కేసు పెడతారా అంటూ, ఇది అసలు చెల్లుతుందా అంటూ కొంతమంది దీర్ఘాలు తీస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. అలాగే సుప్రీం కోర్టు వారించిన వినకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కోర్టు ధిక్కరణ అవుతుందన్న వారి వాదనలపై ఆయన ఘాటుగా స్పందించారు. సుప్రీం కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేసుకోరా… ఎవరు వద్దన్నారని అంటూనే, కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేస్తే మా గోదావరి జిల్లాల భాషలో చెప్పాలంటే జోడుచ్చుకొని కొడతారని అన్నారు .
మిమ్మల్ని కనీస అవగాహన లేని శుంఠలుగా పరిగణిస్తారని తెలిపారు . మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం తప్పయితే, ఐదున్నర సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 36 మందిని కాదని 37వ వ్యక్తిగా మా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరు చేర్చి నంద్యాలకు వెళ్లి రఘురామిరెడ్డి అనే పోలీసు అధికారి అప్పుడేలా అరెస్టు చేశారని ప్రశ్నించారు.
మీరు ఏదైనా చేయవచ్చు కానీ మీకు జరిగితే మాత్రం నిబంధనలు గుర్తుకు వస్తాయా అంటూ రఘురామకృష్ణం రాజు విరుచుకుపడ్డారు . ఒక నేరం జరిగినప్పుడు ఆధారాలు ఎప్పుడు దొరికినా అప్పుడు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయవచ్చునని ఆయన తెలిపారు . అప్పుడేమో గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారని స్టేట్మెంట్ ఇచ్చారని, ఇప్పుడు నిందితులుగా ఇద్దరు పోలీసు అధికారులతో పాటు జగన్మోహన్ రెడ్డి పేరును చేర్చడాన్ని తప్పు పట్టడం పట్ల రఘురామకృష్ణం రాజు ఒంటి కాలిపై లేచారు.
నేను గుర్తు పట్టలేదని నన్ను కొట్టిన వారి గురించి చెప్పానని, ఎవరు కొట్టించారో వారి గురించి కాదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్ నన్ను చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నానికి కుట్ర చేశారన్నారు. కొట్టిన వారు ఎక్కడికి వెళ్తారని, వారిపై అధికారులు చెబితే కానిస్టేబుళ్లు కొట్టారన్నారు.
నన్ను కొట్టించడానికి ఆ తర్వాత హత్యాయత్నం చేయడానికి కుట్ర చేసింది సునీల్ కుమార్, సీతారామాంజనేయులు , జగన్మోహన్ రెడ్డి, విజయ పాల్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ గా వ్యవహరించిన ప్రభావతి వైద్య నివేదికలను తారుమారు చేసిందన్నారు. ఇందులో నేను చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, సాక్షి దినపత్రిక రాతలను పట్టించుకోవలసిన అవసరం లేదని, అయినా సాక్షి దురాభిమానులైన వారికి ఆ శుంఠ చెప్పింది అబద్ధమని చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నివేదిక ఫేక్… మిలిటరీ ఆసుపత్రి నివేదికలో దెబ్బలు కొట్టినట్లు స్పష్టం
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నివేదిక ఫేక్ అని, మిలిటరీ ఆసుపత్రి నివేదికలో చిత్రహింసలకు గురి చేయడం వల్లే కాలి వేలు విరిగిందని, రక్తస్రావం జరిగిట్టు స్పష్టంగా పేర్కొనడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మిలిటరీ ఆసుపత్రి నివేదికను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని వివరించారు. సుప్రీం కోర్టు బెయిల్ నాకు ఎందుకు ఇచ్చింది… కొట్టారని నిర్ధారించుకొని, మీరు దుర్మార్గులు చంపేస్తారన్న ఉద్దేశంతోనే ఇచ్చిందని గుర్తు చేశారు.
124 A సెక్షన్ కింద నాపై తప్పుడు కేసు నమోదు చేసిన దాన్ని విచారించుకొమ్మని చెబుతూ , సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. మిలిటరీ ఆసుపత్రి నివేదిక వచ్చిన తర్వాత, మధ్యలో ఈ కేసు వస్తుందని తెలియగానే పీవీ సునీల్ కుమార్ అతి తెలివితో మధ్యలో కారులో ఏమి జరిగిందో తెలియదు అంటూ కొత్త నాటకానికి తెర లేపారన్నారు. సిఐడి కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేసిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆమె నా కాళ్ళను చూసిందన్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. నా కాళ్లు మల్లె పువ్వుల్లా, ప్రస్తుతం ఉన్నట్లుగానే పింకు కలర్ లో ఉంటాయి. నా కాళ్ళ మీద కొట్టిన విషయాన్ని ధ్రువీకరించే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నివేదికను పీవీ సునీల్ కుమార్, అక్కడి వైద్యులను బెదిరించి, భయపెట్టి తారుమారు చేయించారు. ఈ విషయాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే చెప్పారు. రేపు విచారణలోనూ చెబుతారు.
వైద్య నివేదికలన్నీ బయటకు వస్తాయి. హైకోర్టు ఏ డాక్టర్ కు రిఫర్ చేస్తే, ఆ డాక్టర్ వద్దకు తీసుకు వెళ్లకుండా మధ్యలో కొత్త డాక్టర్ తో పరీక్షలు చేయించి తప్పుడు నివేదికలను తయారు చేశారో అన్ని బయటకు వచ్చేత్తాయని రఘురామకృష్ణం రాజు తమ గోదావరి స్లాంగ్ లో అపహాస్యం చేశారు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వైద్యులు తప్పుడు నివేదికలు ఇవ్వడానికి నిరాకరించగా వారిపై ఒత్తిడి చేసి తప్పుడు నివేదికలను తయారు చేశారు. ఇప్పుడు ఒకరు కాకపోతే మరొక వైద్యుడైన నిజాన్ని చెబుతారన్నారు.
అందరూ ప్రభావతి లాగా సుధాకర్ రెడ్డి లాగా ఉండరు కదా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఒక కార్డియాలజిస్ట్ నా వద్దకు వచ్చి కాళ్లకైన దెబ్బలను చూసి రాజుగారు మీరు ప్రత్యేకంగా మందులు వాడాలని సూచించారు. ఆ కార్డియాలజిస్ట్ పేరు నాకు తెలియదా?. అతన్ని అడిగితే నిజాలు బయటకు రావా ??. నిజాలు చెప్పేందుకు సాక్షులంతా సిద్ధంగా ఉన్నారని ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించాలన్నారు.