370 సీట్లకు పైగా గెలవడమే లక్ష్యం

– ఎన్నికల కోడ్ రాకముందే యాత్ర పూర్తి
– జనసందేశ్ డిజిటల్ పత్రికను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర రేపు (ఫిబ్రవరి 20న) ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 విభాగాలుగా జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రేపటి నుండి 4 యాత్రలు కొనసాగుతాయి. 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,440 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది. ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే విజయసంకల్ప యాత్రకు పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు.

ఈ యాత్రలు సభలు మాత్రమే కాకుండా రైతులు, చేతి వృత్తులకు, నిరుద్యోగలు, పొదుపు సంఘాల వారితో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ రోడ్ షోల ద్వారా ముందుకు వెళ్తుంది. బహిరంగ సభలు ఎక్కడా ఉండవు. అన్ని యాత్రలలో రోడ్ షోలు మాత్రమే. 5 యాత్రలు 5,500 కి.మీ ఉంటుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలను కలుస్తారు. 119 నియోజకవర్గాలలలో 114 నియోజకవర్గాలలో యాత్ర వెళ్తుంది. మొత్తం 5 యాత్రలల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ ఉంటాయి. మార్చి 2వ తేదీ వరకు యాత్రలు పూర్తవుతాయి. ఎన్నికల కోడ్ రాకముందే యాత్రను పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నాం.

దేశంలోని 543 పార్లమెంటు స్థానాల్లో 370 సీట్లకు పైగా గెలవడమే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మెజారిటీ స్థానాలు గెలవడమే లక్ష్యం. తెలంగాణలో 17కు 17సీట్లు గెలవడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నాం. మెజారిటీ సీట్లలో విజయం సాధిస్తాం. బీఆర్ఎస్ తో పొత్తు అనేది మూర్ఖులు చేస్తున్న ప్రచారం. 17 సీట్లలో సింగిల్ గా పోటీ చేస్తాం. 2018 ఎన్నికల్లో అనేక స్థానాల్లో మా ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు రాలే. ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకున్నారు. కాబట్టే 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాం.