-రాష్ట్ర గృహ నిర్మాణ.సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
-అన్న క్యాంటిన్ లో అల్పాహారాన్ని ప్రజలకు వడ్డించి, వారితో కలిసి భుజించిన మంత్రి పార్థసారధి
ఏలూరు/నూజివీడు, ఆగష్టు, 16 : అన్నార్తుల ఆకలి నింపడమే ‘అన్న క్యాంటిన్ల’ ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు పట్టణంలోని రామాయమ్మారావు పేటలో ‘అన్న క్యాంటిన్ ‘ ను మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ప్రారంభించారు. ప్రజలకు దగ్గరుండి అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కార్మికులు, ప్రజలు ఎన్నో పనులమీద పట్టణాలకు వస్తుంటారని, అల్పాహారం, భోజనానికి వందల రూపాయలు ఖర్చు అవుతుంటాయన్నారు. అలాంటి పేదలకు 5 రూపాయలకే కడుపునిండా భోజనం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ప్రజలను సంతోషపరిచేలా వారి ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడం కూటమి ప్రభుత్వం బాధ్యతన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధితోపాటు అన్ని రంగాలను అభివృద్ధి బాట పట్టించి, యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలలో ప్రధానమైన 5 హామీలకు సంతకాలు చేశారన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి ప్రతీ నెలా ఒకటవ తేదీ ఉదయం 6 గంటలకే వారి ఇంటివద్దే అందిస్తున్నామన్నారు. వృద్దులు, వితంతువులకు 3 వేల నుండి 4వేల రూపాయలకు పెంచడంతోపాటు 3 నెలల బకాయిలతో కలిపి 7 వేల రూపాయలను ఒకేసారి చెల్లించామన్నారు.
దివ్యంగులకు 3 వేల నుండి 6 రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి 5 వేల నుండి 10 వేల రూపాయలకు పెన్షన్ పెంచామన్నారు. 16 వేల 700 పోస్టులతో మెగా డీఎస్సీ కి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. పారిశ్రామికరంగంలో నైపుణ్యం కలిగిన వారికి డిమాండ్ ఉందని, అందుకే యువతకు అభిరుచి కలిగిన రంగంలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు.
నిరుపేదల ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటిన్లను ఆగష్టు,15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంబిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల నిధులను వారి అనుమతి లేకుండా, వారికి తెలియకుండా పూర్తిగా మళ్లించిన ఘనత గత ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక విధ్వంసం, రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూటమి నేతలకు ఉందన్నారు. అన్ని రంగాలలో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి పార్థసారథి చెప్పారు. అనంతరం అన్న క్యాంటీన్లో అల్పాహారాన్ని మంత్రి ప్రజలతో కలిసి రుచి చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, డిఈ లక్ష్మి నారాయణ, వార్డ్ కౌన్సిలర్ చెరుకూరి దుర్గా ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.