Mahanaadu-Logo-PNG-Large

టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం విరుద్ధం

బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి 

తిరుపతి, మహానాడు:  టిటిడి చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి  టీటీడీ ఈఓ శ్యామలరావును కోరారు.  ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైంది. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత 5 సంవత్సరాల కాలంలో ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేసి అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా అర్హత లేకపోయినా అధికారాన్ని కట్టబెట్టి టీటీడీ ప్రతిష్టను దిగజార్చారన్నారు!

ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధర్మంగా వ్యవహరించడంతో అర్హత కలిగిన వ్యక్తికి అన్యాయం జరిగిందన్నారు. న్యాయబద్ధంగా సత్యనారాయణకు చీఫ్ ఇంజనీర్ గా పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈవో శ్యామలరావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలన్నారు. టీటీడీ రూల్స్ కు వ్యతిరేకంగా సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ధర్మకర్తల మండలి చైర్మన్లు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం అర్హత కలిగిన ఇంజనీర్లను డిపిసి (DPC…డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) లో పక్కనపెట్టి అన్యాయం చేసి తమకు అనుకూలమైన వారికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను కట్టబెట్టడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు.

టీటీడీ చీఫ్ ఇంజనీరుగా తమకు అనుకూలమైన వ్యక్తి ఉంటే కోట్లాది రూపాయల టెండర్ల ప్రక్రియలో “ఈ” ప్రొక్యూర్మెంట్, ఆన్ లైన్ టెండర్లలో కాంట్రాక్టర్ల వివరాలను ముందే తెలుసుకొని వారిని బెదిరించి రాజీ చేసి తమకు అనుకూలమైన వారికి పనులు అప్పజెప్పి కమిషన్లు దండుకోవచ్చు అన్న కుట్రతో రూల్స్ కు వ్యతిరేకంగా పదోన్నతులు కల్పించారన్నారు. జిఎం ప్రొక్యూర్ మెంట్ ను టీటీడీ చీఫ్ ఇంజనీర్ నుంచి అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి చేతిలో పెట్టుకొని రైస్, నెయ్యి, బెల్లం, ముడి సరుకుల కొనుగోళ్లలో భారీ అక్రమాలకు తెరలేపారన్నారు. నాసిరకం సరుకులను సరఫరా చేసే గుత్తేదారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని శ్రీవారి సంపదను కొల్లగొట్టారన్నారు.

టీటీడీ  ఇంజనీరింగ్ టెండర్ లో జరిగిన అవినీతి అక్రమాల గురించి సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారన్నారు. కోట్లాది రూపాయల సివిల్ ఇంజనీరింగ్ పనులకు అతి తక్కువ లెస్ పర్సంటేజ్ తో అయిన వారికి టెండర్లు కట్టబెట్టారన్నారు. అవసరం లేకపోయినా బాగున్న గోవిందరాజ సత్రాలను కూల్చారు. వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని ప్రకటించడం టీటీడీ ఇంజనీరింగ్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పరాకాష్ట అన్నారు. టిటిడి చీఫ్ ఇంజనీరింగ్ పదోన్నతులలో DPC రూల్స్ కీ వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావుకు నవీన్ విన్నవించారు.