– టెలి కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష జరిపారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి.
అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశం. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశం. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలి. అత్యవసర పనుంటే తప్పా ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలి. 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం ఆదేశించారు.