-బంగారు బిస్కెట్ల అపహరణ
-భక్తులను తీసుకెళ్లి విచారిస్తున్న పోలీసులు
చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన సిబ్బందితో పాటు, క్షుణ్ణంగా తనిఖీ అనంతరం భక్తులను సైతం అనుమతిస్తారు. అయితే 200 గ్రాములకు పైగా రూ.10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను తస్కరించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆ భక్తులను స్థానిక పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేపడుతున్నారు.
బ్యాంకు అధికారి చేతివాటం
ఈ లెక్కింపుకు స్థానిక బ్యాంకుకు చెందిన అప్రైజర్ ప్రకాశ్ హాజరయ్యారు. కుప్పగా పోసిన కానుకల్లోంచి 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను తన సంచిలో వేసుకున్నాడు. విషయాన్ని గమనించిన ఆలయ ఈవో ప్రశ్నించగా బ్యాంకు అధికారి దబాయించాడు. దాంతో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీని గుర్తించారు. తరువాత ఆ బంగారు బిస్కెట్‌ను తీసుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ప్రకాశ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.