జనాభా కంటే జగన్ సంక్షేమ పథక లబ్ధిదారులే ఎక్కువ

-హవ్వ… ఇదెక్కడి విడ్డూరం?
-సెక్రటేరియట్ తాకట్టుపై ప్రధానికి లేఖ రాశా
-జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కీము స్కామే
-లక్ష కోట్లు ఖర్చు పెట్టినా జగన్మోహన్ రెడ్డి నెగ్గడు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రాష్ట్ర జనాభా కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఎక్కువగా ఉండడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. సంక్షేమ పథకాల పేరిట తరచూ బటన్ నొక్కానని పేర్కొనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేని అరకోటి కుటుంబాలకు రేషన్ ఇచ్చామని చెప్పుకుంటున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం 75 లక్షల కుటుంబాలకు రేషన్ సరఫరా చేస్తుండగా, అదనంగా మరో 45 లక్షల కుటుంబాలకు తామే రేషన్ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఒక ఇంటికి సగటున మూడున్నర మంది చొప్పున వేసుకున్న, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ రాష్ట్రంలోని దారిద్ర రేఖ దిగువన ఉన్న ప్రజలకు సరిపోతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నామని చెబుతున్న రేషన్ ఎక్కడకు వెళ్తోందని ఆయన ప్రశ్నించారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నిజమైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరిపోతుంది. అయినా, అదనపు కుటుంబాలు ఉన్నాయని వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేషన్ సరఫరా చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఖర్చు రాసి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ సరుకులను ఎగుమతి చేస్తున్నారన్నారు. ఆఫ్రికాలోని మూడు, నాలుగు దేశాల్లో, వీరు వేలకోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెడుతున్నట్లుగా ఇటీవల నన్ను కలిసిన ఒక విదేశీ ప్రతినిధి బృందం సభ్యులు చెప్పారు.

పింఛన్ దారులకు ఇచ్చే సొమ్ము వారి అకౌంట్లో జమ చేస్తే, నొక్కేయడానికి కుదరదనే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి జగన్ బాబు ఇచ్చాడని చెప్పి తలుపు కొట్టి మరి పంపిణీ చేస్తున్నారు. అదే ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వమంటే మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకంటే, ఆ జీతం సొమ్ము మొత్తం ఉద్యోగుల అకౌంట్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో నేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కీము స్కామే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి స్కీము ఒక స్కామేనని రఘురామకృష్ణం రాజు తెలిపారు . ఒకవైపు దేశ ప్రధానమంత్రి డిజిటలైజేషన్ ప్రక్రియకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగదు ఎక్కడ చేతులు మారుతుందో అక్కడ డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టడానికి సుతారం ఇష్టపడడం లేదు. వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లను నేరుగా అకౌంట్లో జమ చేసే అవకాశం ఉన్నప్పటికీ, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయిస్తున్నారు.

అలాగే మద్యం అమ్మకాలలో డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా లావాదేవీలు నిర్వహించాలని ఎన్నిసార్లు కోరిన పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క స్కీం కూడా నగదు చెల్లింపులు చేయడం లేదు. ప్రతి స్కీము డిబిటీ పద్ధతి లోనే అమలు చేయడం జరుగుతోంది . జగన్మోహన్ రెడ్డి అవ్వ, తాతల పేరిట ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలను డ్రా చేయడం వెనక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు..

లక్ష కోట్లు ఖర్చు పెట్టినా జగన్మోహన్ రెడ్డి నెగ్గడు
రానున్న ఎన్నికల్లో లక్ష కోట్ల రూపాయలను ఖర్చుపెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నెగ్గె పరిస్థితి లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. వైకాపా తరఫున ఎన్నికల సర్వేలను ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐప్యాక్ సంస్థ చూసుకుంటుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటో రిషి రాజ్ చెప్పకపోయినా, ఆయన కింద పని చేసే సిబ్బంది ప్రశాంత్ కిషోర్ కు చెప్పి ఉంటారు. ఐప్యాక్ సిబ్బంది చెప్పకపోతే, ప్రశాంత్ కిషోర్ ఎందుకిలా జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నారని చెబుతారన్నారు.

ప్రశాంత్ కిషోర్ హైదరాబాదులో జరిగిన ఒక డిబేట్లో అంత స్పష్టంగా వైకాపా ఎత్తిపోతుందని చెప్పాడంటే, వాళ్ల కంపెనీ అక్కడ పని చేస్తుంది కాబట్టే ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన చెబుతారా? అన్నదే నా పాయింట్ అని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఇది నేను కేవలం కామన్ సెన్స్ తోనే చెబుతున్నాను. ఐప్యాక్ సంస్థను స్థాపించిందే ప్రశాంత్ కిషోర్ అయినప్పుడు, ఆయన తనకున్న రాజకీయ కార్యకలాపాలతో అనుబంధాన్ని తెంచుకున్నప్పటికీ… రిషి రాజ్ అనే వ్యక్తి ప్రశాంత్ కిషోర్ కూర్చోమంటే కూర్చోవడం… నిలబడమంటే నిలబడే వ్యక్తి అని అన్నారు.

ప్రశాంత్ కిషోర్ ఇంత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పిన తర్వాత ఒకవేళ ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని గెలుస్తాడనే అనుకుంటే… అనుకోవడానికి అసలు వీలే లేదు కానీ, ఒకవేళ అనుకున్న ప్రశాంత్ కిషోర్ క్రెడిబిలిటీ దెబ్బ తింటుంది కదా?, ప్రశాంత్ కిషోర్ తన క్రెడిబిలిటీని తానే ఎందుకు దెబ్బ తీసుకుంటాడని రఘు రామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధుల ముందు తన సందేహాన్ని వ్యక్తం చేశారు.

పొత్తు పెట్టుకోవద్దు సార్… అంటూ మోడీని ప్రాధేయపడడానికే హస్తినా కు జగన్
తెదేపా, జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవద్దని ప్రాధేయపడడానికి జగన్మోహన్ రెడ్డి, హస్తి నాకు వస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. కూటమితో బిజెపి పొత్తు పెట్టుకుంటే, పది జిల్లాలలో వైకాపాకు అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు. ప్రధాని మోడీతో భేటీ కోసం జగన్మోహన్ రెడ్డి టైం అడిగారట. అయినా, ఎన్ డి ఏ నూతన భాగస్వామ్య పార్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారా? అని ప్రశ్నించిన ఆయన, ఒకవేళ ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి తీవ్రంగానే ప్రయత్నం చేస్తారన్నారు.

సెక్రటేరియట్ తాకట్టుపై ప్రధానికి లేఖ రాశా
రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టిన వైనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆయనకు సుదీర్ఘమైన లేఖ రాసినట్లు రఘురామ కృష్ణంరాజు వివరించారు. ఎక్కడా లేనిది కనీ విని ఎరగని రీతిలో రాష్ట్ర సెక్రటేరియట్ ను జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేశారు. బటన్ నొక్కడం కోసమో, సొంత ఖర్చులకోసమో తెలియదు కానీ 350 కోట్ల రూపాయలకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వద్ద సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడాన్ని ఏమనాలి? ఏమి చేయాలి అంటూ ప్రశ్నించారు.

మనం ఏమి చేయగలం… ఓటు అనే ఆయుధం ద్వారా ఓడించగలం అంతేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసేందుకు సమయాన్ని కోరినట్లు తెలిసింది. ఆలో గానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన విషయాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాను. దీంతో ఏమ్మా… జగన్, సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టేశావట కదా అని ఆయన ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, గతంలో విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలను, పార్క్, రైతు బజార్, డైరీ ఫార్మ్, వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను, ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టేశారన్నారు.

వీటన్నింటినీ తాకట్టు పెట్టి 25 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడానికి నేషనల్ బ్యాంకుల వద్దకు వెళితే ఛీ… పొమ్మన్నట్టుంది. అందుకే ప్రైవేట్ బ్యాంకు వద్దకు వెళ్లి సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టారు. రుణ వాయిదాలను తిరిగి కట్టకపోతే ప్రైవేటు బ్యాంకు యాజమాన్యం సెక్రటేరియట్ ను స్వాధీనం చేసుకొని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యోగులను లోపల అడుగుపెట్టనివ్వరని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

తాగుబోతు లాంటి భర్తే… ఈ పాలకుడు
ఒక తాగుబోతు అయిన భర్త తన వ్యసనాల కోసం ఇంటిని, భార్య మెడలోని తాళిబొట్టును తాకట్టు పెట్టినట్లుగానే, ఈ ప్రభుత్వ అధినేత డబ్బు వ్యసనంతో సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టేశాడని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. భార్య మెడలోని తాళిబొట్టు, ఇల్లు తాకట్టు పెట్టి తినడానికి నాలుగు బియ్యం గింజలను తెచ్చిన వాడిని మహానుభావుడని అంటామా అని ప్రశ్నించారు. గదిలో కూర్చోబెట్టి వాయించేస్తాము. ఇంటిని, ఇంటి ఇల్లాలు తాళిబొట్టును తాకట్టు పెట్టిన వాడిని ఎలా క్షమించలేమో, ఈ ప్రభుత్వ పెద్దలను కూడా అలాగే క్షమించవద్దని రఘురామ కృష్ణంరాజు కోరారు.

సెక్రటేరియట్ ను తాకట్టు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అంతుచిక్కడం లేదు. రాష్ట్ర సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన అంశాన్ని సాక్షి దినపత్రికలో ఖండిస్తారని భావించాను. ఖండించలేదంటే, రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారని స్పష్టం అవుతుంది. లేకపోతే రామోజీరావు, రాధాకృష్ణ ఇవేమి రాతలని సాక్షి దినపత్రికలు రాసుకుని ఉండేవారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 261 (1), 293(3) ఈ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించింది.

రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాజ్యాంగంతో సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. బ్యాంకులతో కుమ్మక్కై అడ్డగోలుగా రుణాలు చేశారు. స్వకుల అధికారులు ఉండడంతో ప్రభుత్వం అడిగిందే తడవుగా రుణాలను మంజూరు చేశారు. ఆ తరువాత వారు వచ్చి ప్రభుత్వ సలహాదారులుగా చేరిపోయారు. కార్పొరేషన్ల పేరిట అప్పులను ఎలా కొల్లగొట్టడం అన్న దానిపై ప్రభుత్వ పెద్దలకు మార్గదర్శనం చేశారు. ఈ సంవత్సరం మొదట్లో రాష్ట్ర ప్రభుత్వ రుణ పరిమితి కేవలం 36 వేల కోట్ల రూపాయలని ఆర్బిఐ స్పష్టం చేసింది.

అయినా ఇప్పటికే 70 నుంచి 79 వేల కోట్ల రూపాయలను రుణంగా ఎత్తారు. ఈ రుణ మొత్తం లక్ష కోట్లకు చేరువ అయ్యేలా ఉందని ఇటీవల జీవి రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ రుణ పరిమితి 36 వేల కోట్ల రూపాయలు అయినప్పుడు, లక్ష కోట్ల రూపాయల రుణాన్ని ఎత్తినప్పటికీ ఆర్బిఐ ఎందుకు మీనమేషాలను లెక్కిస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన ఈ ప్రభుత్వంపై సంబంధిత శాఖల ద్వారా విచారణ జరిపించి, తక్షణమే శిక్షించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

ఈ విషయాన్ని నీలి పేపర్లు కాని వారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రముఖంగా వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుకోసమే రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రి తాకట్టు పెట్టారని ఎవరైనా అంటే, ఒక తాగుబోతు భర్తకు భార్య ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, అలాగే ఈ దుర్మార్గపు ప్రభుత్వ ప్రజా ప్రతినిధికి ఉండాలన్నారు.

ప్రస్తుతం ప్రజల వ్యక్తిగత ఆస్తుల డాక్యుమెంట్లు ప్రభుత్వ పెద్దల వద్దే ఉన్నాయని, ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టినప్పటికీ, అప్పు ఇవ్వడానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యాజమాన్యానికి బుద్ధి ఉండాలి కదా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టుకోవడం ఏమిటని, అదే మీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సంస్థ కాదన్నారు. రానున్న ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వద్ద సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి పొందిన 350 కోట్ల రూపాయల రుణాన్ని తీర్చేస్తారన్నారు.

వ్యూహం సినిమా కలెక్షన్లతో పబ్లిక్ పల్స్ తెలిసిపోయింది
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా కలెక్షన్ల ద్వారా పబ్లిక్ పల్స్ తెలిసిపోయిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాయలసీమలో వ్యూహం కలెక్షన్లు తొలి రెండు రోజుల్లో వచ్చిన 2.91 లక్షల రూపాయల షేర్ తో , క్యూబ్ చార్జీలు కవర్ అయ్యాయి. వాల్ పోస్టర్లు, పత్రికల్లో ఇచ్చిన వ్యాపార ప్రకటనల ఖర్చుల డబ్బులు రికవరీ కాలేదు. చివరకు వాల్ పోస్టర్ల మైదా కోసం చేసిన ఖర్చు కూడా వెనక్కి రాలేదు.

సాధారణంగా ఆదివారం ప్రతి సినిమా కలెక్షన్లు పెరుగుతాయి. వ్యూహం సినిమాకు అది రివర్స్ లో జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి సినిమా కలెక్షన్ల రిపోర్ట్ నా చేతికి రాకుండా నిలువరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. అయినా నాకు డి సి ఆర్ అందింది. ఎక్కడ ఎన్ని షోలు పడ్డాయో తెలిసింది. చాలా చోట్ల అసలు షోలే పడలేదు. ఒక థియేటర్లో ఎనిమిది టికెట్లు తెగితే షో వేస్తారట. అంటే ఎనిమిది టికెట్లు కూడా తెగ లేదని దీని అర్థం. ఒక వ్యక్తిని చూడడానికి ప్రజలు ఆసక్తి ప్రదర్శించడం లేదంటే, ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది.

దీనికోసం పెద్ద పెద్ద సర్వేలు చేయవలసిన అవసరం లేదు. తనని తాను మహానుభావుడిగా కీర్తించుకుంటూ గత రెండు నెలలుగా ప్రచారం చేసుకున్నప్పటికీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడడానికి ప్రజలు ఆసక్తి ప్రదర్శించడం లేదంటే, ఇక వైకాపా పని అయిపోయినట్లే. వైకాపాకు 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నట్టు గా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. అందులో 10 శాతం అంటే ఐదు లక్షల మంది ఈ సినిమాను చూసిన సినిమా కలెక్షన్లు బ్రహ్మాండంగా ఉండే ఉన్నారు. ఒక్కొక్క సినిమా థియేటర్లో మూడు నుంచి ఐదు టికెట్లు మాత్రమే తెగాయంటే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు, వ్యూహం కలెక్షన్లకు సంబంధం ఉన్నట్లేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

వైయస్ వివేకా హత్యతో అంతిమ లబ్ధిదారు ఎవరో అందరికీ తెలిసిందే
చంపింది ఎవరు? అంటూ సాక్షి దినపత్రికలో రాసిన కథనంపై రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో స్పందించారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య ద్వారా అంతిమ లబ్ధిదారులు ఎవరో ప్రజలందరికీ తెలుసు. వైయస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ ముందే పోలీసులకు అందజేసి ఉంటే అది హత్య అని తెలిసి ఎవరు శవం వద్దకు వెళ్లి ఉండేవారు కాదని సాక్షి దినపత్రిక తన కథనంలో పేర్కొనడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తల పగిలి పోతే కట్లు కట్టి, గొడ్డలితో ఒళ్లంతా చీరేసిన చోట బ్యాండేజీలు చుట్టేసి, ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కాకముందే మా చిన్నాన్న అలా కొట్టి చంపారు… ఇలా నరికి చంపారని జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

వైయస్ కుటుంబీకులు, శివశంకర్ రెడ్డి కలిసి ఇల్లంతా రక్తపు మరకలను తూడ్చి వేసి కడిగించారని పేర్కొన్నారు. బహుశా వైయస్ వివేకానంద రెడ్డి హత్యను కూడా నన్ను కొట్టినట్లు చూసినప్పుడే చూసి ఉంటారు. డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి ఆమె తండ్రిని చంపేశారని వార్తా కథనంలో రాశాక, ఈ మాట కూడా నేను అనకపోతే తప్పే అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి తండ్రి చనిపోయిన రోజు ఏడు గంటలకు బయలుదేరి ఐదు గంటలకు చేరుకుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ అందుబాటులో ఉన్న ఉపయోగించుకోకుండా, కారులో నెమ్మదిగా పులివెందుల చేరుకున్నారు.

ఒకవేళ వైఎస్ సునీతా రెడ్డి పోస్టుమార్టం కోసం పట్టు పట్టి ఉండకపోతే, ఇప్పటికీ మా బాబాయిని చంపేశారని జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం కన్నీరు కార్చే వారు. పోస్టుమార్టం కోసం వైఎస్ సునీతారెడ్డి, ఆమె భర్త పట్టు పట్టారంటే, వారికి హత్యతో సంబంధం లేదనే కదా అర్థం. ఎవరైతే వైయస్ వివేకానంద రెడ్డి శవాన్ని త్వరగా ఖననం చేయాలని తొందరపెట్టారో వారికి ఈ హత్యతో సంబంధం ఉందని సిబిఐ కూడా స్పష్టం చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు హత్య చేసిన వారు ఎక్కడ ఉన్నారో, హత్య చేయించిన వారు ఎక్కడ ఉన్నారో, హత్య చేసిన వారు ఎక్కడ ఉన్నారో స్పష్టంగా పేర్కొంది.

హైదరాబాదులోని ఒక భవంతికి ఉదయం ఐదున్నర గంటలకే ఫోన్ వెళ్లిందని, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి తన వాంగ్మూలంలో వెల్లడించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టవద్దని, సిబిఐ విచారణ చేపట్టాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ ను తీసుకు వచ్చారు. తరువాత తాను అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ కాకుండా, రాష్ట్ర పోలీసుల ద్వారానే విచారణ చేపట్టారు. చివరకు డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి హైకోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ కోసం పట్టు పట్టింది.

సీబీఐ విచారణలోనూ రామ్ సింగ్ అనే అధికారి నిజాయితీగా, నిక్కచ్చిగా విచారణ జరుపుతుంటే అతనిపై రివర్స్ కేసులను నమోదు చేశారు. ఇప్పుడు అప్రూవర్ గా మారిన దస్తగిరిని జైలులో, ఈ కేసు లో సహా నిందితుడైన శివ శంకర్ రెడ్డి కుమారుడు 20 కోట్ల రూపాయలు ఇస్తామని, సిబిఐ అధికారుల బలవంతం మేరకే వాంగ్మూలాన్ని ఇచ్చానని చెప్పాలని ప్రలోభ పెట్టారని, అయినా దస్తగిరి అంగీకరించలేదన్నారు.