– ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో మార్పు మొదలయ్యింది
– పూర్తి ఫలితాలు సాధించాలన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
కొంతమంది సూపరింటెండెంట్లు అందించిన సమాచారం నిక్కచ్చిగా లేదు
– అలసత్వాన్ని సహించమన్న మంత్రి
– మెరుగైన పనితీరు కోసం రూపొందించిన 30 అంశాల ప్రణాళిక అమలుపై సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి
అమరావతి : గత నెల రోజులుగా సర్వ జన ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపర్చడానికి చేపట్టిన చర్యలతో మార్పు మొదలయ్యిందని, ఆశించిన మేరకు పూర్తి ఫలితాల్ని సాధించడానికి, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని కలిగించడానికి ఈ ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగైన నిర్వహణ కోసం ఆగస్టు 13న విడుదల చేసిన 30 అంశాలతో కూడిన ప్రణాళిక అమలును గత నెల రోజులుగా అమలు చేసిన తీరును మంత్రి నేడు సమీక్షించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమీక్షలో 17 ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, డిఎంఇ డాక్టర్ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సూపరింటెండెంట్లు ఇచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వాసుపత్రుల నిర్వహణలో స్వాగతనీయమైన మార్పు మొదలయ్యిందని, ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని, ఆశించిన ఫలితాల్ని సాధించడంలో ఎటువంటి అలసత్వాన్ని ప్రభుత్వం అంగీకరించదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
ప్రభుత్వాసుపత్రుల్లోని డాక్టర్లు, ఇతర సిబ్బంది కష్టించి పనిచేస్తున్నా ప్రజల్లో పూర్తి స్థాయిలో విశ్వాసం కలగడంలేదని, ఈ లోటును వీలైనంత త్వరగా పూరించాలని మంత్రి సూచించారు. సమగ్ర మార్పు కోసం గత నెలలో ప్రకటించిన 30 అంశాల ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కోరారు.
మంత్రిత్వ శాఖ రూపొందించిన 30 అంశాల ప్రణాళిక మేరకు ఆయా ఆసుపత్రుల్లో గత నెల రోజులుగా చేపట్టిన చర్యల్ని సూపరింటెండెంట్లు వివరించారు. తక్కువ సమయంలో ఓపీ సేవల్ని అందించడానికి అదనపు ఓపీ కౌంటర్ల నిర్వహణ, సాయంకాలం కూడా ఓపీ సేవల్ని అందించడం, రోగులు, సందర్శకుల సమాచారం కోసం సైనేజ్ బోర్డులు ఏర్పాటు, రక్త పరీక్ష మరియు ఇతర పరీక్షల ఫలితాల్ని సాయంత్రం 2-3 గంటల మధ్య అందించడం, ఆసుపత్రులకు వచ్చిన వారికి సహాయాన్ని అందించేందుకు ఫ్రంట్ డెస్క్‌ల ఏర్పాటు వంటి చర్యల్ని చేపట్టినట్లు సూపరింటెండెంట్లు మంత్రికి వివరించారు.
వీటితో పాటు వివిధ పరీక్షల కోసం వాడే పనిముట్లు, యంత్రాల లభ్యత గురించి ఆడిట్ చేయించినట్లు, ఆసుపత్రుల ప్రాంగణాల్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత నెల రోజులుగా చేపట్టిన చర్యలతో ఓపీ సేవలు అందుకున్న వారి సంఖ్య పెరిగినట్లు వారు తెలిపారు.
రోగులు, వారి సహాయకుల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు ప్రతి విభాగంలోనూ ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయడంతో పాటు వారి నుంచి సేవల లభ్యతపై అభిప్రాయాల్ని తెలుసుకున్నట్లు కూడా వారు వివరించారు. రోగులకు అందించే డైట్ నాణ్యతపై నిఘా పెంచడంతో మంచి ఫలితాలు వస్తున్నట్లు కూడా వారు వివరించారు.
30 అంశాల కార్యాచరణ ప్రణాళిక మేరకు మొదటి మూడు నెలల్లో చేపట్టాల్సిన చర్యలపై పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి సత్ఫలితాలను సాధించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూపరింటెండెంట్లను కోరారు. నేటి సమీక్షా సమావేశంలో వారు వివరించిన ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ధారించేందుకు ప్రత్యేక విజిలెన్స్ బృందాల్ని పంపిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యత దృష్ట్యా ప్రతి నెలా తాము సమీక్షిస్తామని కూడా మంత్రి చెప్పారు.
కొంత మంది సూపరింటెండెంట్లు అందించిన సమాచారాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ డ్యాష్ బోర్డులో పరిశీలించి నిర్ధారించుకున్నారు. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 104 కొన్ని చోట్ల సరిగా పనిచేయడం లేదని అందిన సమాచారాన్ని, మంత్రి స్వయంగా ఆ నంబరుకు ఫోన్ చేసి నిర్ధారించుకుని , ఆ లోపాన్ని వెంటనే సరిదిద్ధాలని మంత్రిత్వ శాఖ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. కొంతమంది సూపరింటెండెంట్లు అందించిన సమాచారం నిక్కచ్చిగా లేదని ఎత్తిచూపారు.
ఈ సమావేశంలో పలువురు సూపరింటెండెంట్లు ప్రతిపాదించిన వీల్ చైర్లు, స్టెచర్లు, ఇతర పరికరాలు, సిబ్బంది అవసరాల్ని పరిశీలించి వాటి లభ్యత కోసం తగు చర్యల్ని చేపట్టాలని మంత్రిత్య శాఖ అధికారుల్ని సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
రోగాల బారిన పడి ఎంతో ఆశతో, నమ్మకంతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు పూర్తి సంతృప్త స్థాయిలో సేవల్ని అందించే లక్ష్యంతో ఆసుపత్రుల నిర్వహణ జరగాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు.
30 అంశాల ప్రణాళిక అమలును ప్రతి వారం సమీక్షించుకుని ప్రభుత్వం, ప్రజలు ఆశిస్తున్న మార్పు కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే మంజూరు చేయబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.