ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుతున్న సీఎం

– ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

ఇబ్రహీంపట్నం, మహానాడు: గత ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను సీఎం చంద్రబాబు చక్కదిద్దుతున్నారన్నారని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదివారం పాల్గొన్నారు. అక్కడి ప్రజల ఇళ్ళకు వెళ్ళి వారి ఇబ్బందులు, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనపై పలువురి అభిప్రాయాలను విన్నారు.

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమ కరపత్రాలు పంపిణీ చేసి, వందరోజుల ప్రగతి, సీఎం కష్టపడుతున్న వైనం గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వారి సమ్మతితో ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ వందరోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే మెగా డీఎస్సీతో నిరుద్యోగ యువతకు భరోసా కల్పించడమే కాకుండా రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యో గావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించి రూ.5కే భోజనం అందిస్తున్నామన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో అర్ధిక పరిస్థితి, అయోమయంగా మారినా, ప్రకృతి విపత్తులతో విజయ వాడ అతలాకుతలమైనా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే అత్యధిక వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు అందజేయడంతో పాటు, ఒకటో తేదీనే అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ లాభం కలిగేలా ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునేలా సీఎం గారు పాలన అందిస్తున్నారని వెల్లడించారు.

ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద వరద బాధితులను సీఎం స్వయంగా పరామర్శించారన్నారు. అలానే వరద బాధితులను సత్వరమే ఆదుకున్నారని అన్నారు. త్వరలోనే నష్టపరిహారం అందుతుందన్నారు. వరదల్లో మృతి చెందిన వారికి రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చామని అన్నారు. బుడమేరు గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చివేశామన్నారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ), ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.