సూపర్‌ 6 అమలు చేస్తూ కూటమి సర్కారు దూసుకుపోతోంది…

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటి అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పట్టణంలో అద్దంకి రోడ్డు, కురిచేడు రోడ్లలోని బస్‌ షెల్టర్లను గురువారం ప్రారంభించి, మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సహకారంతో నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్నారు.

త్వరలో మహిళలకు ఉచిత బస్ పథకం అమలు కాబోతుందని వెల్లడించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రతి పేదవాడికి ఆకలి తీర్చాలన్న మహోన్నత లక్ష్యంతో నేటి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించారని, త్వరలో దర్శి పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకుందామన్నారు.

ప్రతి తల్లికి నెలకు 1500 పెన్షన్, తల్లివందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి 15000 రూపాయలు నగదు, డిఎస్సీ కూడా త్వరలో ప్రకటించనున్నారని ఇలా ఒక్కొక్క పథకం కూటమి సర్కారు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ యువనాయకులు డాక్టర్‌ కడియాల లలిత్ సాగర్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితర ప్రభుత్వ సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, మహిళలు పాల్గొన్నారు.