Mahanaadu-Logo-PNG-Large

‘ఫ్యాను’ రెక్కల రోదన

– జగనా..నువ్వింక మారవప్పా!
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ఆ అబ్బాయి చాలా మంచోడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు.పైగా బోలెడంత ఆస్తి ఉంది. చేతిలో అధికారం కూడా ఉంది. కాకపోతే ఒక్కటే దుర్గుణం’’ అని ఆగిపోయాడట ఓ పెళ్లిళ్ల పేరయ్య. ‘‘ఇన్ని సుగుణాలున్న అబ్బాయికి ఆ ఒక్క లోపం ఫర్వాలేదు. ఇంతకూ ఏమిటా లోపం’’ అని ఆరా తీశాడట పెళ్లికూతురు తండ్రి. ‘‘అబ్బే ఏం లేదండీ. అతినికి తెలియదు. చెబితే వినడు’’ అన్నాట్ట పెళ్లిళ్ల పేరయ్య. దానితో చిర్రెత్తుకొచ్చిన పిల్లతండ్రి.. చాల్చాల్లే.. ఇక బయలుదేరండి. ఆ ఒక్కటి చాలదూ.. నా పిల్ల బతుకు బుగ్గిపాలు కావడానికి! తెలియని వాడికి, చెబితే వినని వాడికి నా పిల్లనిచ్చి గొంతు కోయలేను. అలాంటి వాడికి ఎన్ని ఆస్తులుంటే ఏం ప్రయోజనం’’ అని పెళ్లిళ్ల పేరయ్యను పంపించేస్తాడు. ఇది చిన్నప్పుడు కథల పుసక్తంలో చదివిన జ్ఞాపకం. ఇప్పుడు అధికార వియోగం అనుభవిస్తున్న వైసీపీ అధినేత జగన్‌రెడ్డి తీరు కూడా, అంతే ఉందన్నది వైకాపేయుల గుసగుస. పిచ్చి ఆశలు, వెర్రి నిర్ణయాలతో.. ఉన్న ఆకొద్ది పరువు కాస్తా, పెన్నా-కృష్ణా-తుంగభద్రలో జాయింటుగా కలిపేస్తున్నారన్నది ‘ఫ్యాను’రెక్కల రోదన.

మూర్ఖుల మనసు రంజింపచేయడం కష్టమన్నది పాతకాలంలో పెద్దలమాట. జగన్ యువకుడయినప్పటికీ.. ఇంకా ముతకకాలంలోనే బతుకుతున్నట్లు, నెల్లూరు సెంట్రల్ జైలు ఘట్టం రుజువుచేసింది. పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి ఈవీఎంలు నేలకొట్టిన, ‘అత్యంత ప్రజాస్వామ్యవాది’, ప్రముఖ స్వాతంత్య్ర సమరయూధుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి.. అమాయకుడని బిరుదు ఇచ్చిన జగన్‌రెడ్డి తెలివి తెల్లారినట్లే ఉందన్నది వైకాపాలో వినిపిస్తున్న ముచ్చట.

కావాలనే ఈవీఎంను నేలకేసికొట్టాడని, లేకపోతే అక్రమాలు ఎలా తెలిసేవన్నది జగన్ తెలివిగా అడిగానని మీడియాకు వేసిన ప్రశ్న. పిన్నెల్లిని అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నది మరో మతిలేని ఆరోపణ. అదేదో సినిమాలో ‘పిచ్చోడిని వినడమేకానీ లైవ్‌లో ఇప్పుడే చూస్తున్నా’నన్న బ్రహ్మానందం డైలాగు, జగన్‌ను చూస్తే గుర్తుకురాక మానద ంటున్నారు.

‘ప్రజాస్వామ్యాన్ని అత్యంత దారుణం’గా ప్రేమించే.. పిన్నెల్లి ఘనకార్యాన్ని, ప్రపంచం ఒళ్లన్నీ కళ్లు చేసుకుని మరీ చూసింది. ఈసీ కూడా సారువాడి వీరోచిత కార్యాన్ని చూసి అవక్కాయి.. ‘ఆయన సంగతేందో చూడండి’ అని రాష్ట్ర అధికారులను పురమాయించింది. దానితో కేసు పెట్టిన పోలీసులకు దొరక్కుండా జంపయి, హైదరాబాదులో తేలి.. వైసీపీ-పిన్నెల్లిని అతిగా ప్రేమించే ఒక జర్నలిస్టు కారులో సిటీలో కాలక్షేపం చేశాడు. తర్వాత కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం, ఆ తర్వాత అరెస్టు, నెల్లూరు సెంట్రల్ జైలు జీవితం తెలిసిందే.

ఈసీ ఆదేశాల మేరకు.. అరెస్టయి ఈవీఎం పగలకొట్టిన కేసులో విచారణ ఖైదీగా ఉన్న పిన్నెల్లిని, ఆయనేదో స్వాతంత్య్ర సమరయోధుడి లెక్క, జగన్ జైలుకు వెళ్లి కలవడమే ఒక రోత. ఆ సందర్భంగా బయటకొచ్చి, మీడియా వద్ద చేసిన ఆరోపణలు రోతన్నర రోత. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల ఇళ్లపై అత్యంత కిరాతకంగా దాడులు చేస్తున్నారట. వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందట. మళ్లీ ఐదేళ్ల తర్వాత మీకూ ఇలాంటి గతే పడుతుందన్నది జగన్ పెట్టిన శాపాలు.

గతంలో హత్యలు చేసిన వారిని, అక్రమ కేసులకు గురయి జైల్లో మగ్గుతున్న నేతలను వైఎస్-బాబు లాంటి నేతలు వెళ్లి పరామర్శించడం చూశాం. కానీ ఈవీఎంను పగులకొట్టి, ప్రజాస్వామ్యానికి పాతర వేసిన ఓ మూకనేతను జైలుకెళ్లి పరామర్శించడం ఇప్పుడే చూస్తున్నాం.

మీడియా ముందుకు రాకరాక వచ్చిన సారువాడిని పలకరించి, ఏమైనా ప్రశ్నలు వేద్దామనుకున్న మీడియాకు, అసలు సారువాడు సమయమే ఇవ్వలేదు. తాను చెప్పదలచుకున్న నాలుగుముక్కలు గొట్టాల ముందు చీదేసి, కారెక్కి తుర్రుమన్నారు. బహుశా మీడియాను ఇంకా జగనన్న, స్టెనోగ్రాఫర్లగానే చూస్తున్నట్లుంది. మీడియానే ఎదుర్కొనే ధైర్యం లేని జగన్ సాహసం గురించి పెద్దగా ముచ్చటించాల్సిన పనిలేదు.

కానీ జగనబ్బాయి మాటలు ప్రపంచానికి చేరాయి కాబట్టి.. ఆ అమాయక చక్రవర్తి ఆరోపణల తీరు చర్చకు అర్హమైనదే. అసలు దాడుల గురించి జగన్ మాట్లాడమే దరిద్రంన్నర దరిద్రం. కార్యకర్తల ఇళ్లపై దాడులు, హింస గురించి జగన్ మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడక తప్పదు.

విపక్షనేతగా ఉన్న బాబు ఇంటిపై దొమ్మీకి వెళ్లిన జోగి రమేష్ అనే మూకనాయకుడికి, మంత్రి పదవిచ్చిన ఘనత జగన్ బాబుదే. డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ఆఫీసును ముష్కరమూకలు విధ్వం చేస్తే.. నా అభిమానులకు బీపీ వచ్చి ఉండవచ్చన్న జగన్ వ్యాఖ్యలు మరువలేం. ఇక పట్టాభి అనే గొంతున్న నేతను, ఇంటికెళ్లి ఎత్తుకొచ్చిటార్చర్ చేసిన నాటి ఉన్మాదం ఇంకా మర్చిపోలేదు.

సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు, వృద్ధురాలి ఇంటిపైకి సీఐడీ జాగిలాలు వదిలిన ఘనత జగన్‌ ది. మాస్కు అడిగినందుకు సుధాకర్ అనే వైద్యుడిని చిత్రహింసలు పెట్టి, ఆయన చావుకు కారణమైన ఘనత కూడా జగన్‌ రెడ్డికే సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాస్తే రామాయణం. చెబితే భారతం అవుతుంది!

అక్కడిదాకా ఎందుకు? తనను ప్రశ్నించినందుకు.. నాటి ఎంపి రఘురామకృష్ణంరాజును, హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి గుంటూరుకు ఎత్తుకొచ్చి, చిత్రహింసలకు గురిచేసి పైశాచకానందం పొందిన రాక్షసపర్వం.. వికటించి జగన్ పతనానికి దారితీసింది. చంద్రబాబును రెండు నెలలు జైలులో వేసి, బాత్రూమ్ సౌకర్యం కూడా ఇవ్వకుండా వికృతానందం పొందిన జగన్.. వేధింపుల గురించి మాట్లాడితే, వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుతో చితికిపోవడం ఖాయం.

సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు, ఐదేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా రాక్షసానందం పొందిన శాడిస్టు జగన్‌రెడ్డి.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే రక్తం రుచిమరిగిన పులి, అహింస గురించి మాట్లాడినట్లుందన్నది జగన్‌ను ప్రేమించేవారి వ్యాఖ్య.

జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకెళ్లి, స్వాతంత్య్ర సమరయోధుడు పిన్నెల్నిని పరామర్శించిన వైనం చూసిన వైకాపేయులు.. ‘ఇక మా వాడు మారడప్పా’ అంటున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా, మీడియాకు ముఖం చాటేసే నేతను ఈయననే చూస్తున్నామంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు మీడియాను వాడుకోవడం తెలియని ఆసామి తెలివితేటల గురించి, వైకాపేయులు ఘనంగా చెప్పుకుంటున్నారు.

అసలు తన ఓటమి కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోకుండా, అప్రజాస్వామ్యం.. హింస.. దాడులు.. అనైతికం.. వంటి ‘తన ఒంటికి సరిపడని’ డైలాగులు కొట్టడం మానుకుంటే మంచిదన్నది వైకాపేయుల సలహా. డీలాపడిన కార్యకర్తల్లో సమరోత్సాహం నింపే బదులు.. హిమాలయాలకు వెళ్లాలనే ‘పదకొండా’నందస్వామి మాటలు, పార్టీకి పాతరవేసేనంటున్నారు.

ఎలాగూ ఈవీఎం పగులకొట్టిన స్వాతంత్య్ర సమరయోధుడు పిన్నెల్లిని పరామర్శించిన జగన్.. అదే హెలికాప్టర్‌కు మరో 25 లక్షలు ఇచ్చి, మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన.. తన పార్టీ మాజీ ఎమ్మెల్యేను కూడా పరామర్శించి వస్తే ఒక పనైపోతుందన్నది వైకాపేయుల సూచన. బంతిలో బలపక్షం ఎందుకు? ఒక మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ , పోక్సో చట్టం కింద అరెస్టయి కర్నూలు జైలులో ఉన్నారు. మరి ఈవీఎం పగులకొట్టిన రెడ్డిగారిని జైలుకెళ్లి పరామర్శించిన జగన్‌రెడ్డి.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసి జైల్లో ఉన్న దళిత నేత సుధాకర్‌ను పరామర్శించనంత పాపం ఆయనేం చేశారు? పరామర్శలోనూ కులపక్షపాతం ఉంటే ఎట్లప్పా?

ఒక ఆరునెలలు మౌనంగా ఉండి, పార్టీ జెండా మోసిన వారితో మమేకమై, తాను హిమాలయమంత ఎత్తున సంపాదించిన డబ్బును వారికి ఖర్చు పెడితే, పార్టీ పదికాలాలపాటు పదిలంగా ఉంటుందన్నది వైకాపేయుల సలహా.

ముఖ్యంగా.. ఇప్పటికీ తానొక దైవాంశసంభూతుడినన్న పిచ్చి భ్రమలు.. తనను ఎవరూ ప్రశ్నించకూడదన్న నియంత నైజం..తనను ఓడించి ప్రజలే తప్పు చేశారనే మతిలేని భ్రమల ప్రపంచం నుంచి బయటకొచ్చి, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచిస్తే.. ఇంకా బోలెడు వయసున్న జగన్ భవిష్యత్తుకు తిరుగులేదన్నది వైకాపేయుల ఉవాచ.