సంక్రాంతిలోపు అభివృద్ధి పనులు పూర్తి

– కలెక్టర్ నాగలక్ష్మి

గుంటూరు, మహానాడు: పల్లె పండుగ – గ్రామ పంచాయితీ వారోత్సవాలలో భాగంగా జిల్లాలో 13.73 కోట్ల నిధులతో 160 అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ తెలిపారు. ​మంగళవారం చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ – గ్రామ పంచాయితీ వారోత్సవాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత రోడ్డు పనులకు భూమి పూజ చేసి, అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.

గ్రామ సభల్లో ఆమోదించిన పనులను ప్రజల భాగస్వామ్యంతో సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేసుకోవడం లక్ష్యం అన్నారు. పొన్నూరు శాసన సభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అయిదేళ్ళు నిలిచిపోయిన అభివృద్దిని ముందుకు తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. పంట నష్టం అందని వారికి త్వరలో మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామంలో 1750 ఎకరాల పంట నష్టం సంభవించిందని, ఒక హెక్టారుకు రూ.25 వేల ప్రకారం ప్రభుత్వం పంట పరిహారం అందించిందన్నారు.

​తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, చేబ్రోలు మండల ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, పీడీ డ్వామా వి.శంకర్, చేబ్రోలు మండల తహశీల్దార్ శ్రీనివాస శర్మ, ఎంపీడీవో సుజాత, స్థానిక జనసేన పార్టీ నాయకులు మార్కండేయ బాబు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.