రైతులతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం

-గ్యారంటీలపై కేబినెట్‌లో చర్చ జరిగిందా?
-నమ్మించి ఓట్లేయించుకుని వారి గొంతు కోశారు
-ఆరు గ్యారంటీలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది
-మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌, మహానాడు: ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వరి పంటకు 500 బోనస్‌ ఇస్తామని చెప్పి ఓట్లు దండుకోవడం కోసమే మోసం చేశారు. ఇప్పుడు సన్న బియ్యం పంటకు మాత్రమే బోనస్‌ రూ.500 ఇస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు.

తడిసిన ధాన్యం వద్దకు ఇప్పటివరకు కాంగ్రెస్‌ మంత్రులు వెళ్లలేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు మంత్రులు వెళుతున్నారు. తడిసిన వడ్లను ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అధికారంలోకి వస్తే రైతుబంధు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న అంశంపై కేబినెట్‌ మీటింగ్‌లో చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. తమ అవసరాల కోసమే కేబినెట్‌ మీటింగ్‌ పెట్టుకున్నారు..కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల గొంతు కోసింది.. మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతు న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతులతో పతనం తప్పదని స్పష్టం చేశారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, మోసం చేస్తే బండకేసి కొట్టాలని రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు ఎవరిని బం డకేసి కొట్టాలో చెప్పాలని నిలదీశారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో ప్రభుత్వా నికి తెలియడం లేదని వ్యాఖ్యానించారు.