మదర్సా విద్యార్ధిని మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి

– కరిష్మా మృతి ఘటనను సూమోటోగా స్వీకరించిన ‘మహిళా కమిషన్’
– లోతైన విచారణతో నివేదికకు ఆదేశిస్తూ డీజీపీకి లేఖ
– పాయకరావుపేటలో మహిళల పై దాడిచేసి వివస్త్రలను చేసిన ఘటనపై గజ్జల వెంకట లక్ష్మి సీరియస్

అమరావతి: విజయవాడ అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ లోని మదర్సా విద్యార్ధిని కరిష్మా (17) అనుమానాస్పద స్థితి మృతిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆరా తీసింది. ఆమె పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కరిష్మా మృతిపై వినిపిస్తున్న అనుమానాలు, తల్లిదండ్రుల ఆవేదనపై కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించినట్లు చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలియచేశారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన కరిష్మా ఏడో తరగతి పూర్తి చేసింది. మూడేళ్ల అరబిక్ కోర్సు చదివేందుకు ఏడాది కిందట మదర్సాలో చేరింది. బాలికకు అనారోగ్యంగా ఉందంటూ మదర్సా నిర్వాహకులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారు వచ్చేలోగానే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే బాలిక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు.

ఈ మేరకు కుటుంబసభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. కరిష్మా మృతిపై అనుమానాలున్నాయని, తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మదర్సా వద్దకు వచ్చి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మదర్సా నిర్వాహకుల వల్లే మృతి చెందిందంటూ కన్నీరుమున్నీరవడం.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలిక శరీరం పైన గాయాలు కనిపిస్తున్నాయని..మృతి చెందాకే తమ కూతురిని మదర్సా నిర్వాహకులు ఆస్పత్రికి తేవడం వెనుక కారణాలేంటని ప్రశించడంపై మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది.

ఈ కేసును సున్నితమైన అంశంగా భావించి లోత్తైన విచారణ చేయించాలని రాష్ట్ర డీజీపీకి లేఖను రాసింది. ఘటనపై ఇప్పటి వరకు జరిగిన ప్రాధమిక నివేదికను పంపాల్సిందిగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ను కోరుతూ గజ్జల వెంకట లక్ష్మి లేఖను పంపారు. పోలీసు శాఖ సమర్థవంతంగా దర్యాప్తు జరిపి బాధితురాలి తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేయాలని గజ్జల వెంకట లక్ష్మి లేఖలో ఆదేశించారు.

మహిళలపై దాడి, వివస్త్రలను చేసిన ఘటనపై..

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ర్ట మహిళా కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవూరుట్ల చెందిన ఇద్దరు మహిళలను స్థానిక ఓ రాజకీయ పార్టీ నేతలు దాడి చేసి వివస్త్రలను చేసిన ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం వివిధ పత్రికలలో వచ్చిన కథనాలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణను అడ్డుకున్నారనే కారణంతో ఒంటరి మహిళల పై దౌర్జన్యాలకు పాల్పడి వివస్త్రలను చేయడం అత్యంత జుగుప్సాకరమైన చర్య అన్నారు.

ఇలాంటి ఘటనలను సభ్యసమాజం హర్షించదని.. వీటిపై ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించాలని కోరారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలను చేపట్టి నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని.. పోలీసు చర్యలపై కమిషన్ కు నివేదిక పంపాలని అనకాపల్లి ఎస్పీని చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి లేఖలో కోరారు. రాష్ట్రంలో పలుచోట్ల మహిళలపై దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.