”ది గోట్ లైఫ్” ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది- హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాతో 16 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణం చేశారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. “ది గోట్ లైఫ్” ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన అనుభవాలను, తన కెరీర్ విశేషాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేశారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వాస్తవ కథతో “ది గోట్ లైఫ్” సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. రచయిత బెన్యామిన్ నజీబ్ జీవితానికి అక్షర రూపమిచ్చారు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకాన్ని బెన్యామిన్ రాశారు. కేరళలో అనూహ్య పాఠక ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్ కోసం మలయాళం సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ దక్కించుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా “ది గోట్ లైఫ్” తో నా జర్నీ మొదలైంది. 2018లో “ది గోట్ లైఫ్” సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ముందుగా రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నా..అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. నేను బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు జోర్డాన్ షూటింగ్ లో ఉన్నాం. ప్రయాణాలు మొత్తం ఆపేశారు. అక్కడి నుంచి బయటపడే వీలు లేదు. వందేభారత్ ఫ్లైట్ తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్ లో “ది గోట్ లైఫ్” సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ రాజీ లేకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో వర్క్ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది.