-ప్రజా ప్రతినిధులతో, ఎస్.అర్.ఎస్.పి అధికారులతో బేరం
-నాడు బి.అర్.ఎస్ మంత్రి కనుసన్నల్లో.. నేడు కాంగ్రెస్ మంత్రి కనుసన్నల్లో మట్టి దందా
-మట్టి మాఫియాతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లు గండి కొడుతున్న మంత్రి పొన్నం మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యమేమిటో..?
-ఎల్.ఎం.డి నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టి దందాను తక్షణమే నిలుపుదల చేయాలి
-బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి డిమాండ్
కరీంనగర్ : కరీంనగర్ తలాపున ఉన్న లోయర్ మానేర్ డ్యామ్ నుండి దళారులు, కాంట్రాక్టర్ అక్రమంగా మట్టిని తరలిస్తూ అందులో రోజు వచ్చే ఆదాయం నుండి స్థానిక ప్రజా ప్రతినిధులకు, ఎస్.అర్.ఎస్.పి అధికారులకు దళారులు ముడుపులు ముట్టజెప్పి బేరం కుదుర్చుకొని మట్టిని అక్రమంగా తరలిస్తూ మట్టి దందాకు తెరలేపి ప్రతి రోజు లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.
కరీంనగర్ లోని మెడికల్ కాలేజీ పనుల కోసమై మట్టి అవసరం కాగా సదరు దళారిలు, కాంట్రాక్టర్ సంబందిత ఇరిగేషన్ శాఖ అధికారులతో పర్మిషన్ తీసుకొని ఎల్.ఎం.డి నుండి మట్టిని తరలించేందుకు ఒప్పందం చేసుకున్నారని, ఆ దళారిలు ఒక కాంట్రాక్టర్ తో చేతులు కలిపి మెడికల్ కాలేజీకి ఎంతైతే మట్టి అవసరం ఉందో అంత మట్టిని తరలించాక కూడా ఇంకా అదనంగా ప్రతి రోజు మట్టిని తరలిస్తూ దళారిలు, కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడమే కాకుండా ఎస్.అర్.ఎస్.పి అధికారులైన ఈ.ఈ, ఏ.ఈ లకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రతి రోజు ముడుపులు ముట్టజేప్పుతూ బేరం కుదుర్చుకొని దళారులు, కాంట్రాక్టర్ దందా కొనసాగిస్తూ అక్రమంగా ప్రతి రోజు లక్షలు సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ మౌనంగా ఉండడం వెనుక అనేక అనుమానాలు రేకేతిస్తున్నాయని బేతి మహేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
గత ప్రభుత్వంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కనుసన్నల్లో అతని అనుచరులు మట్టి దందాను నడిపి అక్రమంగా కోట్లు సంపాదించిన విషయం అందరికి విదితమేనని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కనుసన్నల్లో మట్టి దందా నడుస్తుంటే చూస్తూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని బేతి మహేందర్ రెడ్డి వాపోయారు.
మెడికల్ కాలేజీ పనుల కోసం మట్టి పర్మిషన్ తీసుకున్నది గోరంత అయితే అక్రమంగా మట్టిని తరలిస్తున్నది మాత్రం కొండంత అని, ఇలాగే ఎల్.ఎం.డి నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న విషయంలో సదరు దళారీలు, కాంట్రాక్టర్, ఎస్.అర్.ఎస్.పి అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా మట్టి దందాను తక్షణమే నిలుపుదల చేయాలని, లేనిపక్షంలో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయించి బీజేపీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు