– కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే ఎందుకు గుర్తించడం లేదు?
– ఉపాధి పనులు చేయకపోతే జిల్లా అభివృద్ధి కుంటుపడే అవకాశం
– జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి
– కాల్వల నిర్వహణ, పర్యవేక్షణ లోపంతోనే పలు సమస్యలు
– నీటి విడుదల సమయంలోనే కాలువల మరమ్మతు పనులు ఎలా చేస్తారు?
– మంత్రి గొట్టిపాటి రవికుమార్
– అధికారుల పర్యవేక్షణ లోపమే సాగునీటి సమస్యలు
– క్షేత్ర పరిశీలన లేకపోవడంతోనే చివరి భూములకు సాగునీరు అందడం లేదు
– రైతులు నష్టాల పాలఅవుతుంటే జల వనరులు, డ్రైనేజీ శాఖ అధికారులకు ఇవేమి పట్టడం లేదు
– మంత్రి అనగాని సత్యప్రసాద్
– ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు కావడం లేదు
– పర్చూరు నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు క్షేత్రస్థాయిలో ఇసుక కొందరు అక్రమంగా తవ్వుకొని వెళ్తున్నారు
– అక్రమ తవ్వకాలను అరికట్టాలి
– చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య ఆరోపణ
బాపట్ల: అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి పట్టాలపై బాపట్ల పయనిస్తుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆయన తొలిసారి బాపట్లకు రావడంతో అధికారులు, ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం డి ఆర్ సి సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పార్థసారథి చెప్పారు. స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. సీఎం ఆశయాలు, ఆలోచనలకు తగినట్టుగా మనం పని చేస్తే బాపట్ల జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు.
బాపట్ల జిల్లాకు 95 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, పర్యాటకంగా వివిధ ప్రాజెక్టులతో అభివృద్ధి చేయగలిగితే అన్ని రంగాలలో రాణించగలమన్నారు. గోవాలో ఏమీ లేకపోయినప్పటికీ పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యం పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ.. సూర్యలంక బీచ్ పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. బీచ్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి నివేదిస్తే తక్షణమే అమలులోకి తెస్తామన్నారు.
ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లోనే యువతకు అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జల వనరులు అందుబాటులో ఉన్న బాపట్లలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ నూతన విధానాలు తోడైతే పారిశ్రామిక రంగం అభివృద్ధి జరుగుతుందన్నారు. బాపట్ల జిల్లాలోని ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు.
జాబ్ కార్డులు ఇచ్చిన వారందరికీ ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పని దినాలు కల్పించాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు. 2.64 లక్షల మంది కూలీలు, ఉపాధి పనులు చేపట్టడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పనులు చేయకపోవడం ఏమిటని అధికారులను నిలదీశారు. ఉపాధి పనులు చేయకపోతే జిల్లా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని అభివృద్ధి పనులకు అనుసంధానించాలని ఆయన సూచించారు.
కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. అత్యధికంగా నిధులు వచ్చే ఉపాధి హామీ పథకంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువులు తవ్వకం, రహదారులు, భవనాలు నిర్మించడంతోపాటు ఉద్యాన పంటలు నాటడం వంటి పనులు చేపట్టాలన్నారు. బాపట్లలో ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత నివ్వాలన్నారు. అక్రమాలు జరిగినచోట సమగ్ర విచారణతో చర్యలు తీసుకోవాలన్నారు.
పలు ఆరోపణలపై పరిశీలించాలన్నారు. అలాగే డిఆర్ డిఏ పరిధిలోని వివో లీడర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని విచారణ జరిపించాలన్నారు. పొదుపు మహిళల సొమ్ము కాజేస్తున్న అంశాలపై దృష్టి సారించాలన్నారు. పంట కాల్వల మరమ్మతు పనుల అంచనాలు, మంజూరు జనవరి నాటికి పూర్తి కావాలన్నారు. తక్షణమే టెండర్లు పిలిచి మార్చి నెల ఆఖరికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ విధానం పూర్తి చేయడానికి తక్షణమే అంచనాలు రూపొందించాలన్నారు.
ఎన్టీఆర్ హౌసింగ్ కింద గతంలో నిర్మించుకున్న గృహాలకు నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గృహ నిర్మాణ శాఖామంత్రి చెప్పారు. నిధులు ఇవ్వకపోవడంతోనే నిర్మాణాలు నిలిచాయని, సర్వే వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో 50వేల 415 గృహాలు మంజూరు కాగా, 16, 362 గృహాలు నిర్మాణం పూర్తయిందన్నారు. 12,014 నిర్మాణాలు మొదలు కాలేదని, పునాది స్థాయిలో 10,504 గృహాలు ఉండగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
గృహ నిర్మాణాలు వేగంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణాలలో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ధాన్యం సేకరణకు అధికారులు సిద్ధం కావాలన్నారు. మిల్లులు గుర్తింపు, గోతాముల కొనుగోలు, టెండర్ల ప్రక్రియ, తేమ యంత్రాల కొనుగోలు తక్షణమే పూర్తి చేయాలన్నారు. 57 మిల్లులులో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సమర్థంగా ధాన్యం సేకరణ చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు వాహనాలలో తరలింపులు పారదర్శకంగా ఉండాలన్నారు. 48 గంటలలోనే ధాన్యం కొనుగోలు సొమ్ము రైతులకు చెల్లించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను సిద్ధంగా ఉంచిందన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగరాదన్నారు.
పంటకాల్వల ఆధునికీకరణ పనులు జిల్లాలో వేగంగా చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పంట కాలువలలో నీటి ప్రవాహంపై అధికారులు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కాల్వల లాకుల వద్ద లస్కర్లను తక్షణమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీటి విడుదల సమయంలోనే కాలువల మరమ్మతు పనులు ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. కాల్వల నిర్వహణ, పర్యవేక్షణ లోపంతోనే పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఇప్పటికైనా కొన్ని కాల్వలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటిని నిలిపి వేగంగా పనులు చేసి నీటిని విడుదల చేయాలన్నారు. ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భావనాసి రిజర్వాయర్ కు నీరంధించే ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. కొరిశపాడు ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. ఈ పథకం నిర్మించి 15 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నిరుపయోగంగా ఉందని, గుత్తేదారుగా పనిచేస్తున్న మెగా సంస్థ ద్వారా పనులు తక్షణమే పూర్తి చేయించాలన్నారు.
531 ఎకరాలకు సేకరణకు రూ.82 కోట్ల నిధుల అవసరతపై నివేదిక ఇవ్వాలన్నారు. మార్టూరు బొమ్మనంపాడు గ్రామాల్లో నీటి సమస్యతో గృహ నిర్మాణాలు పూర్తిగా నిలిచాయన్నారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు బాపట్ల జిల్లాకు 200 ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయన్నారు.
88 కోట్లు ఖర్చు అవుతాయని, రెండు నెలలలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పొలాలకు అవసరమైన సోలార్ ప్యానల్ ప్లేట్లు, ట్రాన్స్ఫార్మర్లు, పశువులు, వాహనాలు చోరీకి గురవుతున్నాయన్నారు. దొంగతనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీకి వివరించారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతోనే బాపట్ల జిల్లా పురోభివృద్ధిలోకి మైనస్తోందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఉంటే విచారించి తొలగించాలన్నారు. అక్రమాలు జరగడానికి వీలు లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించే బాధ్యత అధికారులదేనన్నారు.
జల వనరుల శాఖ అధికారులు క్షేత్ర పరిశీలన లేకపోవడంతోనే చివరి భూములకు సాగునీరు అందడం లేదన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే సాగునీటి సమస్యలు వస్తున్నాయ అన్నారు. తదుపరి సమావేశంలో సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. చివరి భూములకు నీరు సక్రమంగా అందకపోవడం ద్వారా పంటలన్నీ దెబ్బతింటున్నాయని వివరించారు. రైతులు నష్టాల పాలఅవుతుంటే జల వనరులు, డ్రైనేజీ శాఖ అధికారులకు ఇవేమి పట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
స్వర్ణాంధ్ర-2047 విజన్ బాపట్ల లక్ష్యంతో యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వ్యవసాయ రంగం ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.38 వేల 165 కోట్లు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. పరశురామిక రంగంలో రూ.13,862 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యం కాగా, సేవా రంగంలో రూ.23,033 కోట్లు ఆదాయం గడించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
దీపం-2 పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదిలో రు.2,475 లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. జిల్లాలోని 3.53 లక్షల మంది లబ్ధిదారులకు ఏడాదికి రూ.87.48 కోట్లు ఖర్చు చేస్తుండగా, రానున్న ఐదేళ్లలో రూ.437.40 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. ఇటీవల కృష్ణానది విపత్తుతో దెబ్బతిన్న గృహాలు, పంటలకు రూ.69 కోట్ల పరిహారం చెల్లించినట్లు వివరించారు. సమగ్ర ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.
గుంటూరు ఛానల్ విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని శాసనమండలి సభ్యులు కె లక్ష్మణరావు అన్నారు. గుంటూరు ఛానల్ విస్తరణ జరిగితే 25 వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ఇందుకోసం ప్రూఫ్ 143 కోట్ల నిధులు విడుదలైనప్పటికీ పనులు జరగకపోవడంపై ఆరా తీశారు. వైద్య కళాశాల నిర్మాణం త్వరగా పూర్తిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు.
నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని శాసనమండలి సభ్యులు టి మాధవరావు కోరారు. డి ఆర్ సి సమావేశంలో అంశాలను అజెండాలో చేర్చాలని కోరారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భారతి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లస్కర్ల నియామకం వేగంగా చేపట్టి సమస్యల పరిష్కరించాలని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మంత్రిని కోరారు. ఉచిత ఇసుక విధానం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇసుక సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు కావడం లేదని చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య మంత్రి దృష్టికి తెచ్చారు. చీరాల పర్చూరు నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు క్షేత్రస్థాయిలో ఇసుక కొందరు అక్రమంగా తవ్వుకొని వెళ్తున్నారని చెప్పారు. అక్రమ తవ్వకాలను అరికట్టాలన్నారు. ఇసుక తవ్వకాలకు ఏ ప్రాంతంలో అనుమతులు ఇచ్చారో స్పష్టంగా తెలపాలని కోరారు. కే డబ్ల్యూ డి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలన్నారు. సక్రమంగా నీరందక రైతులు నష్టపోతున్నారని వివరించారు. రైతులను దృష్టిలో పెట్టుకొని సాగునీరు అందరికీ సమానంగా విడుదల చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, సిపిఓ శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.