సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు
గుంటూరు, మహానాడు: చేబ్రోలు కొత్తరెడ్డి పాలెంకి చెందిన దళిత బాలిక పేరుపోగు శైలజ హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. గుంటూరు ప్రభుత్వ వైధ్యశాల వద్ద వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా పాశం రామారావు మాట్లాడుతూ చేబ్రోలులో 7వ తరగతి చదువుతున్న బాలిక స్కూలుకు వెళ్ళి తిరిగిరాని స్థితిలో, కుటుంబ సభ్యులు వెతుకుతుండగా నాగరాజు అనే వ్యక్తి ఇంటి వద్ద బాలిక పాదరక్షలను గుర్తించి తలుపులు పగలగొట్టి చూడగా బాలిక హత్యకు గురైందని నాగరాజు పరారిలో ఉన్నట్లు తెలుస్తుందన్నారు. వెంటనే అతనిని అరెస్టు చేసి విచారణ జరిపి నిజనిజాలు తేల్చాల్సి వుందన్నారు.
పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి నిందితులపై చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. గత రెండు నెలల కాలంలోనే రాష్ట్రంలో మహిళలపై అనేక చోట్ల అత్యాచారాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయని వీటిని నిలువరించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. బాలికను అత్యాచారానికి గురి చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నిందితులను శిక్షించాలని కోరారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఈమని అప్పారావు, దండా లక్ష్మీనారాయణ, వై.కృష్ణకాంత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
* జిల్లా విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయండి.
సీపీఎం జిల్లా విస్తృత సమావేశం ఈ నెల 17న ఉదయం 10 గం॥లకు 2/7 బ్రాడిపేట లోని సీపీఎం కార్యాలయంలో జరుగుతుందని జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు పాల్గొంటారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, మండల, పట్టణ కమిటీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సకాలంలో హాజరు కావాలని కోరారు.