మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి నామినేషన్‌

పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు : మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్‌ జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మాచర్ల తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా 9 గంటలకు పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో ఆంజనేయ స్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, పాతూరులోని నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట చీఫ్‌ ఏజెంట్‌ చిరుమామిళ్ల మధు బాబు, భార్య శోభారాణి ఇద్దరితో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్వోకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ తమ వైపే మొగ్గు చూపుతున్నారని, మాచర్లలో గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి తీరుతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని ప్రత్యామ్నాయంగా ప్రజలు కూటమిని గెలిపించు కోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వయసులో కూడా ప్రజల క్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ చైతన్యవంతులుగా చేస్తున్నారని, కూటమి విజయాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని జోస్యం చెప్పారు.