– చెత్తపన్ను, కొత్త లిక్కర్ విధానంతో జనం హ్యాపీ
– లిక్కర్ రేట్లు, క్వాలిటీపై మందుబాబుల ఆనందం
– ఉచిత ఇసుక ధరలపై కొంత విమర్శలు
-బాబు జోక్యంతో త్వరలో అందరికీ ఇసుకకు మార్గం సుగమం
– వర్షాకాలం తర్వాత రాష్ట్రంలో కొత్త రోడ్లు
– దాదాగిరి తగ్గడంతో జనం హ్యాపీ ఎటొచ్చీ కార్యకర్తలతోనే పార్టీకి ఇబ్బందులు
– సోషల్‌మీడియా సైనికుల అసంతృప్తి
-జగనాభిమానులను అరెస్టు చేయకపోవడమే దానికి కారణం
– ఒక్క ఐపిఎస్ పైనా చర్యలు తీసుకోని వైనమూ మరో కారణం
– కొడాలి నాని, వంశీ, జోగి, అవినాష్, సునీల్, సంజయ్, రఘురామిరెడ్డి ని జైలుకు పంపాలన్నదే క్యాడర్ కోరిక
-బాబు-లోకేష్ పాయింట్మెంట్ విధానంపై ఎమ్మెల్యేలు, నేతల -అసంతృప్తి – సాధారణ ప్రజలను కలుస్తున్న బాబు- లోకేష్
– దుర్గేష్, వాసంశెట్టి, నాదెండ్ల నియోజకవర్గాల్లో అనాధగా మారిన టీడీపీ ( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏ పార్టీకయినా ప్రజాభిమానం ప్రధానం. వారి ఆదరణ లేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాదు. కానీ అదే సమయంలో ఏ పార్టీకయినా కార్యకర్తలే బలం. పార్టీలకు వారే మూలస్తంభం. మూలధనం కూడా. కార్యకర్త లేనిదే ఏ పని సాగదు. సూటిగా చెప్పాలంటే కార్యకర్త లేనిదే పార్టీ లేదు.
క్షేత్రస్థాయిలో తన రాజకీయ ప్రత్యర్థితో కలబడి నిలబడేది కార్యకర్తనే.
నాయకులు వస్తుంటారు. పోతుంటారు. కానీ కార్యకర్త మాత్రమే శాశ్వతం. జెండాను భుజం పుళ్లు పడేలా మోసే కార్యకర్త, తన పార్టీ దారి తప్పుతుంటే చూస్తూ ఊరుకోడు. జరుగుతున్న తప్పులను నిర్భయంగా
ఎత్తిచూపుతాడు. హెచ్చరిస్తాడు. అలుగుతాడు. ఆగ్రహిస్తాడు. అది తన హక్కుగా భావిస్తాడు. ఎందుకంటే.. అధికారం లేకపోతే యుద్ధక్షేత్రంలో ప్రత్యర్ధి చేతిలో క్షతగాత్రుడయ్యేది తానే కాబట్టి. తన పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటేనే.. తన గడ్డపై తనకు గౌరవం, పలుకుబడి పెరుతుంది కాబట్టి. అందుకే కార్తకర్త ఏ పార్టీకయినా బలం. బలహీనత కూడా!
ఇప్పుడు ఏపీలో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ఏలుబడిలో ప్రజలు సంతోషంగా ఉంటే.. ఐదేళ్లు జగన్ సర్కారుపై పిడికిలి బిగించి, దౌర్జన్యాలకు గురైన కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదో రాజకీయ వైచిత్రి. బహుశా ఇలాంటి భిన్నమైన పరిస్థితి ఎక్కడా కనిపించి ఉండకపోవచ్చు. ఇంకా విచిత్రమేమిటంటే.. కార్యకర్తలు పదవులు కోరుకోకపోవడం. సహజంగా పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలు, నేతలు పదవులు ఆశిస్తారు. కానీ ఇప్పుడు టీడీపీలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
ఐదేళ్ల జగన్ పాలనలో తను రాచిరంపాన పెట్టిన నాయకులు-అధికారులపై కార్యకర్తలు, తక్షణ చర్యలు ఆశిస్తున్నారు. స్థానికంగా తమను ఇబ్బందిపెట్టిన వైసీపీ నేతలు మళ్లీ చొక్కాలు మార్చుకుని, తమ పార్టీలో మరోసారి పెత్తనం చేయడాన్ని తమ్ముళ్లు సహించలేకపోతున్నారు.
ఉదాహరణకు మంత్రి కందుల దుర్గేష్‌కు వ్యక్తిగతంగా చాలామంచి పేరుంది. కష్టపడి పనిచేస్తారు. అవినీతికి పాల్పడరన్న కీర్తి ఉంది. అయితే ఆయన చుట్టూ పాత వైసీపీ నేతలే ఉండటం, టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందిగా ఉంది.
లెటర్లు కూడా వారి దయాధర్మాలపై ఆధారపడాల్సి వస్తోందన్నది తమ్ముళ్ల ఆవేదన. గత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరికి వ్యతిరేకంగా పనిచేసిన వారంతా, ఇప్పుడు దుర్గేష్ దగ్గర పెత్తనం చేయడాన్ని సహించలేకపోతున్నారు.
ఇక మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో అయితే, మళ్లీ వైసీపీ నేతల హవానే కొనసాగడాన్న తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో తాము, వైసీపీనే ఇంకా అధికారంలో ఉన్నట్లు భావిస్తున్నామంటున్నారు. ఎన్నికలకు 20 రోజుల ముందు వైసీపీ నుంచి పార్టీలో చేరిన సుభాష్, ఇంకా టీడీపీ విధానాలకు అలవాటుపడలేదన్నది తమ్ముళ్ల ఆగ్రహం. ఆయన చుట్టూ టీడీపీ వాళ్లెవరూ లేరని, అంతా పాత వైసీపీ నేతలే కనిపిస్తారంటున్నారు. ఎన్నికల ముందు డీఎస్పీగా పనిచేసిన అధికారి ఇంకా కొనసాగడాన్ని తమ్ముళ్లు సహించలేకపోతున్నారు.
మరో మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో, తమకు ఎక్కడా విలువలేకుండా పోయిందని తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మళ్లీ మనోహర్ కుటుంబసభ్యులే పెత్తనం చేస్తున్నారని, టీడీపీ వారికి పనులు చేయవద్దని అధికారులకు చెబుతున్నారన్నది వారి ప్రధాన ఫిర్యాదు. ఇలా ఈ మూడు నియోజకవర్గాల్లో తాము అనాధలుగా మారాన్నది తమ్ముళ్ల ఆవేదన.
ఇక గోదావరి జిల్లాల్లో పార్టీకి అధికారికంగా ఎలాంటి హోదా లేని.. సానా సతీష్ అనే వ్యాపారి, అన్నింటా పెత్తనం చేయడాన్ని నాయకులు సహించలేకపోతున్నారు. ఎలాంటి హోదా లేకున్నా, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవిని తృప్తి పరిచినందున, త్వరలో తనకు రాజ్యసభ సీటు దక్కుతుందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారని.. జగన్ సర్కారు ఏలుబడిలో తమను కొట్టి, కేసులు పెట్టినప్పుడు సతీష్ ఎక్కడున్నారన్నది వారి ప్రశ్న. ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఆయన మాటే చెల్లుబాటవుతోందన్నది వారి ఆగ్రహం.
పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, జనసేనాధిపతి పవన న్ను దూషించిన వారిని వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో వారికంటే కార్యకర్తలే ఎక్కువ పట్టుదలతో కనిపిస్తున్నారు.
చంద్రబాబును జైల్లో పెట్టిన వారందరిపై.. బదులు తీర్చుకోవాలన్న వారి ఆకాంక్షలకు భిన్నంగా జరుగుతున్న పాలనపై, తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. జగన్ జమానాలో వెలిగిపోయిన అధికారులే.. సీఎంఓ నుంచి సెక్రటేరియేట్.. జిల్లాల వరకూ కనిపించడాన్ని సహించకపోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊడిగం చేసిన ఒక అధికారికి తూర్పుగోదావరి జిల్లాలో, చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పింది చేసిన మరో అధికారికి.. ప్రకాశం జిల్లాలో కీలకమైన పోస్టింగులివ్వడంపై కార్యకర్తలు అగ్గిరాముళ్లలవుతున్నారు.
గత కొద్దిరోజుల నుంచి టీడీపీ సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టింగులు పరిశీలిస్తే.. జగన్ జమానాలో వెలిగిపోయి, పార్టీ నేతలను వేధించిన సునీల్, సంజయ్, పీఎస్సార్ ఆంజనేయులు, రాజేందర్ నాధ్ రెడ్డి, రఘురామిరెడ్డితోపాటు.. ఐదారుగురు జిల్లా మాజీ ఎస్పీలను సస్పెండ్ చేయాలన్నది వారి ఆకాంక్షగా కనిపిస్తోంది. మాజీ డీజీపీ గౌతంసవాంగ్, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని విడిచిపెట్టడంపైనా కార్యకర్తల్లో విస్మయం వ్యక్తవుతోంది. ఈ విషయంలో జగన్ సర్కారు మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును ఏవిధంగా వేధించిందో, వారికీ అలాంటి విధానమే వర్తింపచేయాలన్నది తమ్ముళ్ల కసిగా కనిపిస్తోంది.
అటు బాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జోగి, అప్పిరెడ్డి, పార్టీ ఆఫీసుపై దాడి చేయించిన దేవినేని అవినాష్ వంటి వారిని ఇప్పటివరకూ జైలుకు ఎందుకు పంపించడం లేదన్న ఆగ్రహం కనిపిస్తోంది. అంటే కార్యకర్తలు తక్షణ న్యాయం-ప్రతీకారం కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
“మేం మీకు కసిగా ఓట్లు వేసింది.. వేయించింది.. కేసులు పెట్టించుకుని రీ పనిచేసింది.. జైళ్లకు వెళ్లివచ్చింది.. మీరిచ్చే పథకాల కోసం కాదు. జగన్ దుర్మార్గ పాలన పోయి, మీరు అధికారంలోకి వస్తే ఆ దుర్మార్గులను జైలుకు పంపిస్తారని ఓటేశాం. అంత మెజారిటీ రావడానికి కారణం పాజిటివ్ ఓటు కాదు. కేవలం జగన్ పై వ్యతిరేకత అన్న విషయం మీరు ఇంకా ఎప్పుడు గ్రహిస్తారు? బహుశా మీరు ఇదంతా మీపై పాజిటివ్ ఓటు అనే భ్రమల్లో ఉంటే దాన్ని నుంచి బయటకు వచ్చి, మళ్లీ వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా మోసే కొత్త కార్తకర్తలను ఇప్పటినుంచే తయారుచేసుకోండంటూ పార్టీ సోషల్‌మీడియా గ్రూపుల్లోనే, తమ్ముళ్లు ఘాటు పోస్టింగులు పెడుతున్నారు.
అయితే అటు ప్రజల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వారిలో సంతృప్తి బాగానే కనిపిస్తోంది. ముందు జగన్ పీడ వదిలినందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు. చెత్త పన్ను రద్దు చేయడం మహిళలను మెప్పించింది. నాలుగువేల రూపాయల పెన్షన్ ఇంటికివచ్చి ఇస్తుండటంతో, లబ్దిదారులు మురిసిపోతున్నారు.
ఇక లక్షలాది మంది మందుబాబులు బ్రాందీషాపుల్లో పాత బ్రాండ్లు మళ్లీ రావడంతో ఖుషీగా ఉన్నారు. జగన్ జమానాలో పిచ్చిమందు తాగి జేబు, ఒళ్లు గుల్ల చేసుకున్న మందుబాబులు కొత్త బ్రాండ్లతో హ్యాపీగానే ఉన్నారు. ఇక నిన్న మొన్నటి వరకూ ఉచిత ఇసుక విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, మరికొద్దిరోజుల్లో ఇసుక, అవసరానికి మించి దొరికే పరిస్థితి రానుంది. దానితో ప్రధానైన ఇసుక సమస్యకు తెరపడనుంది. ప్రస్తుత వర్షాకాలం సీజన్ ముగిసిన తర్వాత, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానితో మరో ప్రధానమైన ఆ సమస్యకూ తెరపడనుంది.
కాగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులంతా పార్టీ ఆఫీసులలో ప్రజలకు అందుబాటులో ఉండటంతో.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీ సంఖ్యలో మంగళగిరికి తరలివస్తున్నారు. మంత్రి లోకేష్ కూడా తన నివాసంలో రోజూ వందలమందిని కలసి, అర్జీలు తీసుకుంటున్నారు. తక్షణమే కొన్ని కీలక సమస్యలు పరిష్కరిస్తున్నారు.
అయితే చంద్రబాబునాయుడు లోకేషన్‌ను విడిగా కలిసి చర్చించడం సాధ్యం కావడం లేదన్న అసంతృప్తి, ఎమ్మెల్యేలు-నాయకులలో వ్యక్తమవుతోంది. వారి అపాయింట్మెంట్ పద్ధతి, అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోవడం.. గతానికి, ఇప్పటికి అనేక పద్ధతుల్లో మార్పులు రావటంతో కొంత అసంతృప్తి-అయోమయం కనిపిస్తోంది. పాత పద్ధతికి అలవాటుపడిన సీనియర్లు, ఇతరులకు కొత్త పద్ధతి ఆశ్చర్యపరుస్తోంది. దానితో తరాల అంతరాన్ని సమన్వయం చేసుకోవలసిన అవసరం ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో చంద్రబాబును ఎమ్మెల్యేలు వెళ్లేముందో, వచ్చే ఉందో ధర్మదర్శనం చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదంటున్నారు.