సమస్యలను ఏకరువు పెట్టిన పొన్నూరు వాసులు

అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని
టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర హామీ

గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు న్యూస్‌:ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ రాష్ట్ర నాయకులు, సంఘం డెయిరీ చైర్మన్‌, పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ గురువారం పొన్నూరు పట్టణంలోని 9, 10 వార్డుల లో పర్యటించారు. సూపర్‌ 6 సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 75 ఏళ్ల వృద్ధురాలు ఎండలో పెన్షన్‌ కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుందయ్యా అని ఆవేదన వ్యక్తం చేయగా వాహనం ఏర్పాటు చేసి సచివాలయం దగ్గరకు పంపించి మానవత్వం చాటుకున్నారు. సొంత ఇల్లు ఉందని పెన్షన్లు తీసేశారని, నిత్యావసరాల ధరలు పెరిగి బ్రతకలేకపోతున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మాకు పెన్షన్లు ఆపేశారని తిరిగి పెన్షన్లు ఇప్పించాలని మరికొందరు ఆయన ఎదుట ఏకరువు పెట్టారు. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి లోన్లు మంజూరు చేయాలని, లేని వారికి ఇంటి స్థలాలు ఇప్పించాలని కోరారు. రూ.500 వచ్చే కరెంట్‌ బిల్లు 1000 నుంచి 1200 వరకు వస్తుందని కట్టలేకపోతున్నామని, టీడీపీ రాగానే విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరారు.

మంచినీటి పంపులు లేక నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని మున్సిపాలిటీ పైపులు ఉన్న నీరు రావడంలేదని, తాగునీటి ట్యాంకర్‌ కూడా రోజు మార్చి రోజు వస్తుందని నీరు సరిపోవటం లేదని నీటి సమస్య లేకుండా చూడాలని విన్నవించారు. సైడ్‌ డ్రైన్లు లేక మురుగు మొత్తం ఒకచోటకు చేరుతుందని దోమల బెడద చాలా ఎక్కువగా ఉందని, వాటి వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని సైడ్‌ డ్రైన్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒంటరి మహిళ పెన్షన్లు సచివాలయంలో అప్లై చేశామని రెండేళ్ల నుంచి ఇవ్వడం లేదని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆయన అధికారంలోకి రాగానే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.