- – ఆలోచింపచేసిన ‘మహానాడు’ వార్తా కథనం
– ఇకనైనా సినిమాల్లో సాయికుమార్‌లా పనిచేయండి
– తిక్క శంకరయ్య వేషాలు వేస్తున్న విజయ్ పాల్
– అపరిచితుడు లో విక్రమ్, గజినీలో సూర్యలా అన్ని మర్చిపోయినట్లు నటిస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారి
– లాకప్ చిత్రహింసల కేసులో ఉన్నతాధికారులను కూడా వెంటనే పిలిచి విచారించాలి
– ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల్లో నూతన మద్యం విధానం అమలు
– రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు
ఉండి: లాకప్ చిత్రహింసల కేసులో విచారణ ఎదుర్కొంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారి విజయ్ పాల్ తనకు మతిమరుపు ఉన్నట్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోందని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్, గజినీ సినిమాలో సూర్య లాగా రకరకాల షేడ్స్ ప్రదర్శిస్తున్నట్టు ప్రముఖ దినపత్రిక కథనాల ద్వారా స్పష్టం అవుతోంది.
విచారణ సమయంలో తిక్క వేషాలు వేస్తున్న విజయ్ పాల్ వ్యవహార శైలిని తక్షణమే సుప్రీం కోర్టుకు నివేదించాలని ఆయన కోరారు. విజయ్ పాల్ ను పోలీస్ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. పోలీస్ విచారణకు సహకరించని విజయ్ పాల్ ను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. విజయ్ పాల్ ను విచారించే సమయంలో పోలీసులు వీడియో చిత్రీకరించి ఉంటారని, ఆ వీడియో సాక్షాన్ని సుప్రీం కోర్టుకు నివేదించాలన్నారు. వీడియో సాక్షం ఆధారంగా సుప్రీంకోర్టు విజయ్ పాల్ ను అరెస్టు చేయమని ఆదేశించే అవకాశాలు లేకపోలేదన్నారు.
పోలీసు విచారణ సమయంలో విజయ్ పాల్ అన్ని మర్చిపోయినట్లుగా యాక్టింగ్ చేస్తున్నాడని రఘురామకృష్ణం రాజు అన్నారు. తిక్క శంకరయ్య సినిమాలో ఎన్టీ రామారావులా, పవిత్ర బంధం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావులా నటిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. అభినవ శిశుపాలుడైన విజయ్ పాల్, తనని నువ్వేలా ప్రశ్నిస్తావంటూ విచారణ అధికారిని నిలదీయడం విడ్డూరంగా ఉందన్నారు.
విజయ్ పాల్ రిటైర్డ్ పోలీస్ మాత్రమేనని , అతనికి అతడు ఏమని అనుకుంటున్నాడని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రిటైర్డ్ పోలీస్ అధికారి అంటే ఒక సాధారణ వ్యక్తేనని గుర్తు చేశారు. రిటైర్డ్ ఉద్యోగికి స్థాయి అంటూ ఏమి ఉండదని, అతను ఒక సాధారణ పౌరుడేనని పేర్కొన్నారు. డీజీ స్థాయి అధికారి తప్పు చేసిన, విచారణ అధికారిగా ఎవరినైనా పోలీసు శాఖ నియమించవచ్చునని తెలిపారు. నువ్వు నాకంటే ఉన్నత స్థాయి ఉద్యోగి వైతేనే విచారణకు సహకరిస్తానని విజయ్ పాల్ పేర్కొనడం జ్ఞాన హినుడి లక్షణమని విమర్శించారు.
అలా అంటే… పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు 1992 ,1993 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారులని, వారిద్దరినీ విచారించాలంటే 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారులే విచారించాలన్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారులు రాష్ట్రంలో ఇద్దరే ఉన్నారని చెప్పారు. డిజిపి ద్వారకా తిరుమలరావు, హరీష్ గుప్తాలు మాత్రమే ఉన్నారని తెలిపారు. విజయ్ పాల్ బాటలో వారు కూడా మాట్లాడొచ్చా…మాట్లాడితే వీరిని ఎవరు విచారించాలని ప్రశ్నించారు. ఎవరు వీరిని ఇన్వెస్టిగేట్ చేస్తారని నిలదీశారు. ఇప్పటికైనా విజయ్ పాల్ పిచ్చిపిచ్చి మాటలను కట్టిపెట్టాలన్నారు.
విజయ్ పాల్ ను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేసి ఉంటారని, ఆ వీడియో సాక్షాలను సుప్రీం కోర్టుకు నివేదించాలన్నారు. పోలీస్ విచారణకు సహకరించాలని విజయ్ పాల్ ను సుప్రీం కోర్ట్ ఆదేశించిందని గుర్తు చేశారు. పోలీసు విచారణకు సహకరించని విజయ్ పాల్ ను వెంటనే అరెస్టు చేయాలన్నారు.
లేకపోతే విచారణకు సహకరించడం లేదని గతం మర్చిపోయినట్లుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడని వీడియో సాక్షాధారాన్ని సుప్రీంకోర్టుకు నివేదిస్తే, న్యాయస్థానం, పోలీసులను ఏమైనా చేసుకోమ్మని ఆదేశించే అవకాశాలు ఉన్నాయన్నది నా ఉద్దేశం అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
విజయ్ పాల్ వెనుక ఎవరు ఉన్నారనేది గత రెండు రోజులుగా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అధికారి ట్వీట్లను పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . నువ్వేమీ మాట్లాడవద్దు… గమ్మున కూర్చోమని విజయ్ పాల్ కు చెప్పినట్లుగా ఉందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోతే, ఎవరు తనని ఏమి చేయలేరన్న భావనలో A1 నిందితుడు ఉన్నట్లుగా అర్థమవుతోంది. అతడి ఆదేశాలను విజయ్ పాల్ తూచ తప్పకుండా పాటించడం చూస్తుంటే ప్రజలకు నిజాలు అర్థమవుతున్నాయన్నారు. ఇటువంటి తిక్క శంకరయ్య లను ఏలా ట్రీట్ చేయాలో సిన్సియర్ పోలీసు అధికారులకు తెలుస్తుందన్నారు.
మహానాడులో చక్కటి వార్తా కథనం
అచిర కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహానాడు డిజిటల్ దినపత్రికలో ” కనిపించని నాలుగవ సింహం” పేరిట చక్కటి వార్తా కథనాన్ని ప్రచురించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ కథనంలో నా కేసులోని నిందితుడు ఎలా తప్పించుకొని తిరుగుతూ, సుప్రీంకోర్టు ద్వారా రక్షణను పొందాడో వివరించారని తెలిపారు. నిందితుల ఆచూకీ పోలీసులు తెలుసుకోవాలంటే, నిజంగా తెలుసుకోలేరా? అని ఆయన ప్రశ్నించారు.
న్యాయవాదుల ద్వారా నిందితులు కోర్టులో లొంగిపోతున్న విషయాన్ని మహానాడు డిజిటల్ మీడియా తన వార్తా కథనంలో ప్రస్తావించడం జరిగిందన్నారు. దయతలిచి వారంతట వారే వచ్చి లొంగిపోతే తప్ప… పోలీసులు ఒక్కరిని కూడా పట్టుకోవడం లేదని, అసలేమైంది ఈ పోలీసులకు అని ఒక అత్యద్భుత కథనాన్ని మహానాడు డిజిటల్ దినపత్రికలో చదివానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ఇది నిజం అనిపించింది… పోలీసుల పనితీరు చూసి నవ్వొచ్చిందన్న ఆయన.. ఇకపై పోలీస్ వ్యవస్థ మారుతుందని, సినిమాలో సాయికుమార్ చెప్పినట్లుగా కనిపించని నాల్గవ సింహమేరా పోలీస్ అన్నట్లుగా పనిచేస్తారన్న ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు .
పార్లమెంట్ సభ్యుడిని కొట్టినా కూడా దిక్కు లేదని, ప్రభుత్వం మారిన కూడా ఉన్నతాధికారులను పిలిచి విచారించడంలో ఎందుకు ముఖ మాట పడుతున్నారో అర్థం కావడం లేదని రఘురామకృష్ణం రాజు విస్మయాన్ని వ్యక్తం చేశారు . రవ్వంత ఆలస్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని అమలు చేయడానికి మూడు నెలలు సమయం పట్టినప్పటికీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నూతన మద్యం విధానం నేటి నుంచి అమలులోకి రానుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అమలైన మద్యం విధానం గురించి రచ్చబండ కార్యక్రమంలో వందసార్లకు పైగా మాట్లాడి ఉంటానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. చీఫ్ లిక్కర్ కూడా ఐదు రోజులపాటు నిల్వ ఉంచుతారని, కానీ జే బ్రాండ్స్ అప్పటికప్పుడే బాటిలింగ్ చేసి మద్యపాన ప్రియులకు అందజేసే వారన్నారు. అందులో మత్తెక్కించే కలుషిత పదార్థాల శాతం అధికంగా ఉన్నట్లు పలు నివేదికలలో తేలిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన మద్యంపై నేను కూడా కొన్ని పరీక్షలు చేయించి, ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి నేను చేసిన ఫిర్యాదు, అప్పట్లో పత్రికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందన్నారు. ఈ అంశంపై అప్పట్లో కొంతమంది అధికారులు స్పందిస్తూ కొంతమంది వ్యక్తులు రాంగ్ రిపోర్టులు ఇచ్చారని వారిపై చర్యలు తీసుకుంటామని నన్ను లక్ష్యంగా చేసుకొని హెచ్చరికలు చేశారు.
సదరు అధికారుల హెచ్చరికలతో రండిరా… ప్రూవ్ చేయండని నేను సవాలు చేయగా వారు తోక ముడిచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నూతన మధ్య విధాన నిర్ణయంతో ఈరోజు నుంచి జే బ్రాండ్స్ నుంచి మద్యపాన ప్రియులకు విముక్తి కలిగిందన్నారు. మోతాదుకు మించి మద్యం సేవిస్తే లివర్లు చెడిపోతాయన్న రఘురామకృష్ణంరాజు, అదే జే బ్రాండ్స్ అయితే తొందరగా లివర్లు చెడిపోతాయన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యపాన ప్రియులకు పేరున్న బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. మద్యం ధరలను కూడా గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లు వెత్తాయని తెలిపారు. అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయన్నారు.
కేవలం దరఖాస్తుల ద్వారానే 1800 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది. తొలి రెండు రోజులపాటు దరఖాస్తుల ద్వారా ఆదాయం లభించడం లేదని భావించినప్పటికీ, అంచనాలకు మించి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించిందన్నారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాల కు తొలి రోజు నుంచే డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా దొంగ సరకు నిలిచిపోతాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున దొంగ సరుకు మద్యం దుకాణాలలోకి చేరిందనేది వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలను డిజిటల్ విధానంలో చేపట్టాలని కోరగా, మూడు నెలలు.. ఆరు నెలలు అంటూ గత ప్రభుత్వం సాగదీసిందని, చివరి నెలలో అమలు చేసిందన్నారు.
కూటమి ప్రభుత్వం తొలి రోజు నుంచే డిజిటల్ లావాదేవీలను చేపడుతూ తన సిన్సియారిటీని నిరూపించుకుందని తెలిపారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలలో తిరిగి మంచి మంచి మద్యం బ్రాండ్లను పునః ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. అలాగే మద్యం ధరలను తగ్గించాలని, మద్యం ధరలు తగ్గాయని మద్యపాన ప్రియులు ఎక్కువ మోతాదులో తాగకుండా, తక్కువ మోతాదులోనే మద్యాన్ని తీసుకోవాలన్నారు.
నూతన మద్య విధానంలో హైలెట్ అంశం ఏంటంటే, సామాన్య ప్రజలపై భారం వేయకుండా మద్యపాన ప్రియులపైనే రెండు శాతం సెస్ విధిస్తున్నారని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని మద్యానికి బానిసైన వారికి డి అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించనున్నారు. శృతి మించి మద్యం సేవించిన వారి ఆరోగ్యం చెడిపోతే వారి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులతోనే వైద్యం చేయించడం వినూత్నమైన ఆలోచన విధానం అని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభినందించి తీరాల్సిందేనని రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం కాస్త ఆలస్యమైన ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. శారీరక శ్రమ కోసం మోతాదు స్థాయిలో మద్యం తీసుకోవాలని, అధిక మద్యాన్ని తీసుకోవద్దని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.