-ఏకపక్ష నిర్ణయాన్ని సహించం
-అనుమతివ్వాలని భక్తుల వినతి
తిరుపతి, మహానాడు: తాతయ్య గుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ, పోలీస్, నగరపాలక సంస్థ నిర్ణయాన్ని పరిశీలించాలని గంగమ్మ భక్తులు కోరుతున్నారు. తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారుచేసే తిరుపతి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు, మట్టి తెచ్చే కుమ్మరులు, వేదికను తయారు చేసే వడ్రంగులు, అవిలాల గ్రామపెద్దలు, కైకాల వంశస్తులు, భక్తులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం ప్రకటించాలని కోరారు. జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈవో ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. ఇది సాంప్రదాయాలకు విరుద్ధం, మహా అపచారమన్నారు. కరోనాలోనూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గంగమ్మ జాతరను ఏకాంతంగా నిర్వహించిన విషయాన్ని అధికారులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్ లాంటి అనేక పండుగలు నిర్వహించారని గుర్తుచేశారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే స్థానిక అమ్మవారి భక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని గంగమ్మ తల్లి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి, స్థానికులు హెచ్చరించారు.