పేదల ఆకలి తీర్చినపుడే అసలైన సంతృప్తి

అన్న క్యాంటీన్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ

నరసరావుపేట, మహానాడు:   పేదల ఆకలి తీర్చినపుడే రాజకీయ నాయకునిగా అసలైన సంతృప్తి కలుగుతుందని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అదే సమయంలో పట్టణంలో ప్రారంభం కానున్న మిగిలిన అన్న క్యాంటీన్ల పనుల్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. గతంలో పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, కేవలం రూ.15 కే మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టామన్నారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కక్ష పూరితంగా అన్న క్యాంటీన్లు రద్దు చేశారన్నారు. మరోవైపు అన్న క్యాంటీన్ భవనాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని ఎద్దేవా చేశారు.

పేదలకు అన్నం పెట్టడంపై కూడా కక్ష చూపించిన ఏకైక వ్యక్తిగా జగన్ రెడ్డి రికార్డులు క్రియేట్ చేశారన్నారు. కూలి కోసం పట్టణాలకు వచ్చిన పేదలకు కేవలం రూ.15కి కడుపు నింపడాన్ని కూడా కొందరు వైసీపీ నేతలు హేళన చేయడం వారి దుర్మార్గానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని అన్న క్యాంటీన్ల ప్రారంభంతో మరోసారి నిరూపించబోతున్నామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సంజీవ్ రావు,మోహన్ రావు, సాంబయ్య, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.